ఏపీ రాజకీయాల్లో నేతల పాదయాత్రకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్…స్టేట్ ఏదైనా పాదయాత్ర ఫార్ములా మాత్రం సక్సెస్ ఫుల్. 2003లో దివంతగ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పాదయాత్ర ట్రెండ్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పరిచయం చేశారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఆంధ్రాతోపాటు తెలంగాణలో వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర ఆయనకు 2004లో అధికారాన్ని కట్టబెట్టింది. ఇక, 2013లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా వైఎస్ బాటలో పాదయాత్ర చేసి 2014లో అధికారం దక్కించుకున్నారు. తన తండ్రిని ఫాలో అయిన జగన్…2019 ఎన్నికలకు ముందు దాదాపు 18 నెలల పాటు 134 నియోజకవర్గాల్లో 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికలలో అవలీలగా భారీ మెజారిటీతో అధికారాన్ని అందుకున్నారు.
ఈ క్రమంలోనే ఈ సక్సెస్ ఫుల్ పార్ములాను ఫాలో అయ్యేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సిద్ధమైనప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే రాష్ట్రమంతటా పాదయాత్ర చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని లోకేష్ అనుకుంటున్నారట.
జనవరి 27 నుంచి 400 రోజులపాటు ఏకధాటిగా సాగేలా లోకేష్ పాదయాత్రను రూపొందిస్తున్నారట. ప్రతి నియోజకవర్గంలో 3 లేదా 4 రోజులు సాగేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉండేలా, ఎక్కువ భాగం గ్రామాల్లో పాదయాత్ర కొనసాగేలా చూసుకుంటున్నారట. ఇక, శని, ఆదివారాలలో కూడా నిర్విరామంగా మొత్తం 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగేలా ప్రణాళికలు రచిస్తున్నారట.
2019 ఎన్నికలకు ముందు దాదాపు 18 నెలల పాటు 134 నియోజకవర్గాల్లో 3,600 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేశారు. ఈ క్రమంలోనే లోకేష్ ఆ రికార్డును బీట్ చేసేలా పాదయాత్ర చేయబోతున్నారట. మరి, ఏపీలో ఈ సక్సెస్ ఫుల్ ఫార్ములాతో లోకేష్ అధికారం దక్కించుకుంటారా లేదా అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.