టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు వైసిపి శ్రేణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈనెల 5వ తేదీన భీమవరం శివారు గునుపూడిలో యువగళ: పాదయాత్రపై వైసీపీ మూకలు రాళ్ల దాడికి తెగబడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ దాడిలో పలువురు యువగళం వాలంటీర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, వాలంటీర్లపైనే కేసులు పెట్టి పోలీసులు వారిని స్టేషన్ల చుట్టూ తిప్పడం సంచలనం రేపింది.
కాగా, ఆ దాడిలో లోకేష్ పై అభిమానంతో ఆయనను చూసేందుకు వచ్చిన దుర్గా ప్రసాద్ అనే 13 ఏళ్ల బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆ బాలుడు దుర్గాప్రసాద్ తాజాగా లోకేష్ ను కలుసుకున్నారు. గాయం నుంచి కాస్త కోలుకున్న తర్వాత లొకేష్ ను కలిసేందుకు దుర్గాప్రసాద్ కలంపూడి క్యాంప్ దగ్గరికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే దుర్గాప్రసాద్ ఆరోగ్యం గురించి లోకేష్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దుర్గా ప్రసాద్ భుజం తట్టి ధైర్యం చెప్పారు.
భీమవరం బహిరంగ సభ తర్వాత పాదయాత్రగా వస్తున్న లోకేష్ ను చూసేందుకు గునుపూడి దగ్గరకు దుర్గాప్రసాద్ వచ్చాడు. అదే సమయంలో యువగళం పాదయాత్రపై, వాలంటీర్లపై పక్కా పథకం ప్రకారం వైసీపీ మూకలు రాళ్లదాడికి తెగబడటంతో ఆ దాడిలో దుర్గాప్రసాద్ కంటిపై భాగంలో గాయాలయ్యాయి. ఆ రోజు నుంచే దుర్గాప్రసాద్ కు మెరుగైన వైద్యం అందించాలని టిడిపి శ్రేణులకు లోకేష్ సూచించారు. ఎప్పటికప్పుడు బాలుడి ఆరోగ్యం గురించి లోకేష్ ఆరా తీస్తున్నారు.