టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు ఉన్న పోలవరం నియోజకవర్గంలోకి ఈ రోజు పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న లోకేష్ వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. పోలవరం నిర్వాసితుల కోసం తమ ప్రభుత్వ హయాంలో 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని లోకేష్ అన్నారు. అంతేకాదు, తమ పాలనలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 72 శాతం పనులను పూర్తి చేశామని అన్నారు.
మోసానికి మరో రూపం సైకో జగన్ అని లోకేష్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద 10 లక్షలు ఇస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేశారని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇస్తేనే జగన్ బటన్ నొక్కుతున్నారని చురకలంటించారు. అప్పుడు ఒక మంత్రి గారు ఉండేవారిని, బుల్లెట్ దిగిందా లేదా అని విమర్శలు చేసే వారని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై లోకేష్ సెటైర్లు వేశారు. చివరకు ఆయనకే బుల్లెట్ దిగింది అంటూ మంత్రి పదవి పోయిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. కనీసం నెల్లూరు టికెట్ వస్తుందో లేదో ఆయనకే తెలియని పరిస్థితిలో ఉన్నారంటూ చురకలంటించారు.
ఇక, ఇప్పుడున్న మంత్రిగారు పోలవరం గురించి తనను అడగద్దని అంటున్నారని అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఇస్తామని లోకేష్ ప్రకటించారు. జగన్ లా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాలు కట్టుకుని తిరగబోమని అన్నారు. పోలవరం కట్టాలని సంకల్పించామని, ఆ మాటను టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకుంటామని అన్నారు. తెలంగాణ నుంచి ముంపు మండలాలను ప్రధాని మోడీ గారి సహకారంతో విలీనం చేసుకున్నామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు మౌలిక సదుపాయాలతో మంచి కాలనీలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.