టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర నెలరోజులకు చేరింది. డేట్ల ప్రకారం అయి తే.. ఇప్పటికే నెల అయిపోయింది. కానీ, మధ్యలో మూడు రోజుల గ్యాప్ ఇవ్వడంతో కొంత లేటైంది. అయి తే..యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ హామీలపై హామీలు గుప్పించేస్తున్నారు. ఇప్పటికి నెల రోజుల యాత్రలో 40 వరకు కీలక హామీలు ఉన్నాయి. ఇవి కూడా.. చాలా తేలికైన హామీలేమీ కాదని అంటు న్నారు టీడీపీ నాయకులు.
ఇక, పాదయాత్రలో రోజూ డైరీ రాసుకుంటున్న నారా లోకేష్.. అందులోనూ ఈ హామీలను గుప్పిస్తున్నారు. ప్రధానంగా.. చిత్తూరుజిల్లాకు కీలకమైన వడ్డెర సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చుతామని.. ఇటీవల హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా రజక సామాజిక వర్గాన్ని కూడా ఆ జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. ఇక, మరో కీలకమైన హామీ.. అధికారంలోకి రాగానేప్రతి నియోజకవర్గంలోనూ(ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట) మహిళా కాలేజీ నిర్మిస్తామన్నారు.
రైతులకు ఉచితంగా విద్యుత్, బీడీ కార్మికులకు రూ.3 వేల చొప్పున పింఛన్లు, యువతకు ప్రతి ఏటా నిర్దిష్ట మైన క్యాలెండర్.. ఇలా కొన్ని హామీలు ఉన్నాయి. అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేస్తామన్నారు. పార్టీ అధి కారంలోకి రాగానే.. వడ్డెర నేతలకు, ముస్లిం మైనారిటీ నేతలకు కూడా.. పదవులు ఇస్తామని చెప్పారు. ఇలా.. మొత్తంగా చూస్తే.. చాలానే హామీలను లోకేష్ రెండు చేతులతో ఇస్తున్నారు. అయితే..వాస్తవానికి ఇవన్నీ..నెరవేరుస్తారా? లేదా? అనేది ప్రశ్న.
ఒకవేళ.. ఏదో ఇచ్చేస్తున్నాం.. కదా..అనుకుంటే రేపు ఇబ్బంది తప్పదని అంటున్నారు పరిశీలకులు. హామీలను నెరవేర్చడం.. పైనే రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ అయినా.. అదే పరిస్థితిని ఎదుర్కొంటోందని అంటున్నారు. మరి నారా లోకేష్ ఎడా పెడా ఇస్తున్న హామీలను చంద్రబాబు ఎలా చూస్తారో చూడాలి.