నెల్లూరు సిటీ. ఈ పేరు చెప్పగానే వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అసలు నెల్లూరు తన అడ్డా అని ఆయన పదే పదే కూడా చెబుతుంటారు. అయితే.. తాజాగా యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ఇక్కడ బలమైన ముద్ర వేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మంగళవారం ఆయన ఇక్కడ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఈ సభకు జనాలు పోటెత్తారు. ఎక్కడెక్కడి నుంచో జనాభా తరలి వచ్చారు. ఈ పరిణామాలు.. అనూహ్యంగా టీడీపీలో జోష్ నింపాయి.
నిజానికి ఒక రోజు ముందు నుంచి సభకు ఏర్పాట్లు జరిగాయి. దీంతో అనిల్ వర్గం.. ఈ ఏర్పాట్లను భగ్నం చేయడం ఖాయమని కొందరు టీడీపీ నేతలు అంచనా వేసుకున్నారు. దీంతో రేయింబవళ్లు అక్కడే కాపలాగా ఉన్నారు. కానీ, ఎక్కడా అని ల్ వర్గం బయటకు రాలేదు. పైగా నారా లోకేష్‌పై రెండు రోజుల కిందటే అనిల్ తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడా గెలవని వ్యక్తి.. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి తనపై విమర్శలు చేయడం ఏంటని.. ఎదురు దాడి చేశారు. దీంతో పోలీసులు కూడా యువగళం పాదయాత్ర సిటీలోకి ప్రవేశించే సరికి అలెర్ట్ అయ్యారు.
కానీ, ఎక్కడా అనిల్ వర్గం బయటకు రాకపోవడం.. ఎలాంటి అడ్డంకులు లేకపోవడం గమనార్హం. ఇదిలావుంటే.. నారా లోకేష్ సభకు భారీగా తరలి వచ్చిన జనాభా యువగళం పాదయాత్ర సాగుతున్న తీరుకు అద్దం పట్టింది. వైసీపీలోని సీనియర్ నాయకులు..ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ అయిన.. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి సోదరులు, సహా పలువురు మండల స్థాయి నాయకులు కూడా యువగళం సభకు భారీగా తరలి వచ్చారు. అదేవిధంగా నెల్లూరు సిటీ ఇంచార్జ్ మాజీ మంత్రి పొంగూరు నారాయణ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించారు.
మొత్తంగా చూస్తే.. నెల్లూరు సిటీలో అనిల్ ప్రభావం తక్కువగానే కనిపించిందని పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాదు.. నారా లోకేష్ తనదైన ముద్ర వేశారని.. ఇక్కడ ఆయన సభ పెట్టడం ద్వారా టీడీపీలో నూతన ఉత్తేజం కొట్టొచ్చినట్టు కనిపించిందని అంటున్నారు. మరోవైపు.. నారా లోకేష్ తనదైన శైలిలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. నారాయణ ఇక్కడ పుంజుకున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపును ఎవరూ ఆపలేరని.. తాము అధికారంలోకి వచ్చాక.. వైసీపీ నాయకులకు వడ్డీతో సహా అన్నీ తిరిగి ఇస్తామని వ్యాఖ్యానించారు.