సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా మర్డర్ కేసులో ట్విస్టులు సినీ ఫక్కీలో పూటకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వివేకా కేసులో జూన్ 30న సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ లోని సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ కేసుకు సంబంధించి జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇచ్చిన వాంగ్మూలం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల గురించి గత ఏడాది అక్టోబర్ లో షర్మిల ఇచ్చిన వాంగ్మూలం ఇపుడు సంచలనం రేపుతోంది.
రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగిందని, అంతేగానీ, కుటుంబ, ఆర్థిక కారణాల వల్ల జరగలేదని షర్మిల షాకింగ్ విషయాన్ని చెప్పారు. అవినాష్ రెడ్డి కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా ఉన్నారని, అది కూడా హత్యకు ఒక కారణం కావొచ్చంటూ షర్మిల వ్యాఖ్యానించారు. కడప ఎంపీగా తనను పోటీ చేయాలని వివేకా కోరిన విషయాన్ని కూడా షర్మిల ప్రస్తావించారు. విజయమ్మపై పోటీ చేసిన తర్వాత జగన్ తనకు టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని బాబాయ్ వివేకా అనుకున్నారని షర్మిల చెప్పారు. ఎమ్మెల్సీగా వివేకా ఓటమికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కారణం కావచ్చని అన్నారు.
ఈ నేపథ్యంలోనే షర్మిల వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్ర అని చెల్లి షర్మిల తేల్చిందని లోకేష్ దుయ్యబట్టారు. అబ్బాయి కిల్డ్ బాబాయ్ అనే హ్యాష్ ట్యాగ్ ను లోకేష్ ట్వీట్ చేశారు. అవినాష్ రెడ్డి కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా వ్యవహరించడమే ఈ హత్యకు కారణం అయ్యుండొచ్చన్న షర్మిల వ్యాఖ్యలను లోకేష్ గుర్తు చేశారు. ఏది ఏమైనా, షర్మిల ఆనాడు ఇచ్చిన వాంగ్మూలం ఇపుడు జగన్, అవినాష్ రెడ్డిలను ఇరకాటంలో పడేసింది.
ఇక, ప్రకాశం జిల్లాలో యువగళం పాదయాత్ర సందర్భంగా కమ్మ సామాజిక ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పై 65, తనపై 20 కేసులు పెట్టారని, వాటికి భయపడబోనని చెప్పారు. సన్న బియ్యం సన్నాసి ఒకరు తన తల్లిని అవమానించాని మాజీ మంత్రి కొడాలి నానిపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. నోటికి వచ్చినట్లు తిడితే భయపడబోమని, 16 నెలలు జైలుకు వెళ్లి వచ్చిన జగన్ అందరినీ జైలుకు పంపాలని ఫిక్స్ అయినట్లున్నాడని ఎద్దేవా చేశారు.