ఒక వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవం ఏమిటన్న విషయాన్ని పట్టించుకోకుండా.. జరిగిన పరిణామానికి ఎవరికి వారు తోచినట్లుగా భాష్యం చెప్పుకోవటంతో జరిగింది గోరంత అయితే.. కొండంత ప్రచారం జరగుతోంది. నారా లోకేశ్ జనసేన పార్టీ ఆఫీసుకు వెళ్లటం సంచలనం అవుతోంది. ఒకప్పటి మిత్రులు.. కాలక్రమంలో దూరం కావటం.. మళ్లీ దగ్గర కావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ చోటు చేసుకున్న పరిణామం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
2019లో జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేయాల్సి ఉన్నా.. అనూహ్యంగా ఎవరి దారి వారిదేనన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే. దీంతో నాటి మిత్రులైన టీడీపీ.. జనసేనలు ఎవరికి వారు పోటీ చేసి ఓటమి పాలు కావటం తెలిసిందే. ఒక్క ఛాన్సు అన్న మాట జగన్ నోటి నుంచి రావటం.. దానికి ఏపీ ప్రజలు ప్రభావితం కావటం.. అదే సమయంలో టీడీపీ.. జనసేన ఎవరికి వారు పోటీ చేయటం జగన్ కు కలిసి వచ్చిందని చెప్పాలి.
తాము చేసిన తప్పును తీరిగ్గా సమీక్షిస్తూ.. వేదన చెందుతున్న ఈ రెండు పార్టీలు.. వచ్చే ఎన్నికల నాటికి కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇలాంటివేళ.. లోకేశ్ భవిష్యత్తు కోసం పవన్ తో బాబు కలవక తప్పని పరిస్థితన్న ప్రచారం సాగుతోంది. తాజాగా జనసేన పార్టీ కార్యాలయానికి నారా లోకేశ్ సందర్శించటం రాజకీయ హడావుడికి కారణమైంది. అదెలానంటే.. ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. నారా లోకేశ్ వెళ్లింది జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి కాదు.. కుంచనపల్లి అనే చిన్న గ్రామంలోని జనసేన పార్టీ ఆఫీసుకు వెళ్లారు. గుంటూరు జిల్లాలోని ఈ గ్రామంలో జరుగుతున్న డెవలప్ మెంట్ కార్యక్రమాల గురించి ఆరా తీసే క్రమంలో.. ఆ ఊళ్లో పర్యటిస్తున్న లోకేశ్.. తమ దారిలో ఉన్న జనసేన పార్టీ ఆఫీసు వచ్చింది.
మరో ఆలోచన లేనట్లుగా.. పార్టీ ఆఫీసులోకి వెళ్లిన లోకేశ్.. అక్కడి వారిని అప్యాయంగా పలుకరించటం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామం రాజకీయ ఆసక్తిని రేకెత్తించేలా చేసింది. జనసేన పార్టీ ఆఫీసుకు లోకేశ్ వెళ్లటం పెద్ద అంశం కాదని.. ఆయన పర్యటిస్తున్న ప్రాంతంలోనిది కావటంతో మర్యాదపూర్వకంగా వెళ్లారే తప్పించి.. ఇంకేమీ కాదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అయితే.. లోకేశ్ చర్య ముందుచూపుతో చేసిందన్న వాదన వినిపిస్తోంది.
వచ్చే ఎన్నికలు టీడీపీకి చావో రేవో అన్నట్లుగా మారిన వేళ.. గెలుపునకు అవకాశం ఉన్న ఏ చిన్న విషయాన్ని వదలకూడదన్న పట్టుదలతో బాబు అండ్ కో ఉంది. ఇదే విషయాన్ని తన తాజా చర్యతో జనసేన అధినాయకత్వానికి సంకేతాన్ని లోకేశ్ పంపినట్లుగా అంచనా వేస్తున్నారు. లోకేశ్ ఒక అడుగు ముందుకు వేశారని.. దానికి స్పందన ఎలా ఉంటుందన్న ఆలోచనే తప్పించి..మరింకేమీ కాదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఒక రాజకీయ పరిణామానికి అవసరమైన ముడిసరుకు లోకేశ్ అడుగుతో ముందుకు పడినట్లుగా చెప్పక తప్పదు.