ఇన్ని రోజులు తండ్రి చాటు బిడ్డంగా ఉంటూ.. రాజకీయాల్లో అడుగులు వేస్తూ.. ప్రజల ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఒక్కసారిగా పెద్ద కష్టం వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తండ్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టయ్యారు. 14 రోజుల రిమాండ్ మీద జైల్లో ఉన్నారు. దీంతో ఇప్పుడు తండ్రి అరెస్టుకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడంతో పాటు పార్టీని, శ్రేణులను ఎప్పటికప్పుడూ సిద్ధంగా ఉంచడం లోకేష్ ముందున్న సవాల్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ చినబాబుకు ఇప్పుడు పెద్ద బాధ్యతలు వచ్చిపడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు రిమాండ్కు వెళ్లిన తర్వాత విలేకర్ల సమావేశం పెట్టిన లోకేష్.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అరెస్టు చేస్తే భయపడేదే లేదన్నారు. పోరాటానికి టీడీపీ సిద్ధమని చెప్పారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై లోకేష్ నాయకత్వంలో ముందుకు సాగుతామని టీడీపీ సీనియర్ నాయకులు కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన కలిసి రావడం టీడీపీకి లాభించేదే. మామ బాలక్రిష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి భవిష్యత్ కార్యాచరణపై లోకేష్ ఫోకస్ పెట్టారనే చెప్పాలి.
ఇప్పుడు చంద్రబాబు అరెస్టును జాతీయ స్థాయిలో హైలెట్ చేసేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారు. జాతీయ మీడియాకు ఇక్కడి పరిణామాలు తెలిసేలా చేయనున్నారు. అంతే కాకుండా బాబు అరెస్టు విషయంపై లోకేష్ సుప్రీం కోర్టు న్యాయవాదులతోనూ చర్చిస్తారని తెలిసింది. మరోవైపు ఈ నెల 18 నుంచి ఆరంభం కానున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బాబు అరెస్టును ప్రస్తావించేలా టీడీపీ ఎంపీలకు లోకేష్ మార్గనిర్దేశనం చేయబోతున్నారని టాక్. ఢిల్లీలో ఎంపీలతో ఆయన భేటీ కానున్నారని సమాచారం. మొత్తం మీద తండ్రి జైల్లో ఉన్న ఈ కాలం లోకేష్ కు పరీక్షే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.