ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్రస్థాయిలో విఘాతం కలుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ కు వేధింపులు, సాక్షాత్తూ పోలీస్ స్టేషన్లో ఓ యువకుడి శిరోముండనం ఘటన…వంటివి అందుకు నిదర్శనమని ఏపీ డీజీపీ సవాంగ్ కు చంద్రబాబు లేఖ కూడా రాశారు. అయినా, ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రజలకు రక్షణ కరువైందని నిప్పులు చెరిగారు. ఓ మహిళను అనపర్తి ఎమ్మెల్యే వేధింపులకు గురి చేయడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ మరోసారి ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజలకు రక్షణ లేదంటూ ట్వీట్ చేశారు. అనపర్తి ఎమ్మెల్యే వేధింపులకు అభంశుభం తెలియని అరుణకుమారి అనే ఓ మహిళ బలైందని, వైసీపీ నేతలు రాక్షసుల్లా మారి ప్రజల్ని మింగేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు పంచిన రూ. 2 వేలు కూడా తీసుకోకుండా వైసీపీకి ఓటు వేసినందుకు అరుణకుమారిని పొట్టనబెట్టుకున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటికి వెళ్లే దారిని మూయించి వైసీపీ నేతలు వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని, లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడిందని చెప్పారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని లోకేశ్ అన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి అరుణ కుమారి ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.