అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ సిఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఇదిలా ఉండగానే ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఏ14గా చేరుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు మెమో దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై లోకేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని లోకేష్ కోరారు. లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ కేసులో లోకేష్ పాత్ర ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు ప్రకారం సిఐడి లోకేష్ ను ఈ కేసులో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు వేయలేదని, అటువంటి సమయంలో కేసు ఎలా పెడతారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.