అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు…టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, టీడీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే 30 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంతేకాదు, శాంతిభద్రతల దృష్ట్యా ఈ రోజు చిత్తూరు జిల్లా వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు.
బంద్ సందర్భంగా కొందరు ఆందోళనకారులు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా కంపెనీ బస్సుపై దాడికి పాల్పడ్డారు. బస్సులో ఉద్యోగులు ఉండగానే రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసం కాగా, బస్సులోని ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. బంద్ పేరుతో వైసీపీ దాడులను ఖండిస్తున్నానని లోకేష్ అన్నారు. సైకో జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆరోపించారు. పోలీసుల ఆధ్వర్యంలోనే ప్రతిపక్షం పై దాడి చేసింది గాక ప్రతిగా బంద్ చేయడం వైసీపీకే చెల్లిందని లోకేష్ విమర్శలు గుప్పించారు.
అమర్ రాజా కంపెనీ బస్సు పై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, బస్సులో ఉద్యోగులు ఉండగానే దాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ క్రమంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఎక్కడ ఉన్నారని లోకేష్ ప్రశ్నించారు. ఒకవైపు పుంగనూరులో జరిగిన గొడవల వేడి చెల్లారకముందే శ్రీకాళహస్తిలోనూ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు స్థానిక వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలకు శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ మద్దతుగా ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలను అంజూ యాదవ్ బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జనసేన కార్యకర్తను అంజూ యాదవ్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే.