ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పాలనలో గంజాయి పెంపకంతో పాటు రవాణా, సరఫరా కూడా విచ్చలవిడిగా పెరిగిపోయిందని తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో విశాఖ మన్యంతోపాటు ఏజెన్సీ ప్రాంతాలలో వైసీపీ నేతలు గంజాయి సాగు చేస్తున్నారని, పోలీసులను గుప్పెట్లో పెట్టుకొని రాష్ట్రాన్ని గంజాయి మత్తులో జోగేలా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే . గంజాయి, డ్రగ్స్ సరఫరాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని డీఆర్ఆ నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు లోకేష్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని, సాగుతో పాటు సరఫరా కూడా భారీ స్థాయిలో జరుగుతోందని లోకేష్ తన ఫిర్యాదులో ఆరోపించారు. దేశంలో డ్రగ్స్ సరఫరాలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్న విషయాన్ని గవర్నర్ కు విన్నవించారు. దేశంలో ఏ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాయని లోకేష్ ఆరోపించారు. దేశానికి డ్రగ్స్ సెంటర్ గా రాష్ట్రం మారుతోందని అన్నారు. హవాలా లావాదేవీలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించి అందుకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గవర్నర్ తో భేటీ అనంతరం వైసీపీ నేతలపై లోకేష్ మండిపడ్డారు. వారి ప్రమేయంతోనే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సాగు, సరఫరా జరుగుతోందని ఆరోపించారు. స్మగ్లింగ్ లో పట్టుబడిన వారిలో అధికంగా వైసీపీ నేతలే ఉన్నారని అన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో యువత దాడులకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోయాయని ఆరోపించారు. విద్యార్థులపై కూడా ఆ ప్రభావం అధికంగా పడుతుందని లోకేష్ ఆరోపించారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వాడకం, ఉత్పత్తి అరికట్టేందుకు జగన్ తీసుకున్న చర్యలు శూన్యం అని, అందుకే ఈ రకంగా దేశంలోనే ఏపీ డ్రగ్స్ వాడకంలో అగ్రస్థానంలో నిలిచిందని లోకేష్ విమర్శలు గుప్పించారు.