టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు మరోసారి హీటెక్కింది. భయం గుప్పిట్లోకి జారుకుంది. ఎందుకంటే.. ఇటీవల చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించడంతో.. అక్కడ వైసీపీ కార్యకర్తలు దుమారం రేపారు. దీంతో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్యరణరంగం చోటు చేసుకుంది.
సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా రాజకీయంగా దుమారం రేపాయి. ఈ పరిణామాలతో రెండు రోజుల పాటు సామాన్యులు.. రోడ్డు మీదకు రాలేక పోయారు. సాధారణ వ్యాపారులు, తోపుడు బళ్ల వాళ్లు కూడా.. పోలీసుల దెబ్బకు హడలి పోయారు.
ఇప్పుడు ఈ పరిణామాలు ఇంకా ఇక్కడి ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇదిలావుంటే.. టీడీపీ యువ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో మళ్లీ ఏం జరుగుతుందనేది.. ఆసక్తిగా మారింది. మధ్యాహ్నం 1.45 గంటలకు లోకేష్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు చిత్తూరు సబ్ జైలుకి చేరుకుంటారు. కుప్పంలో అన్న క్యాంటీన్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి ఘటనలో ప్రతిఘటించి అరెస్టయిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో సహా ఇతర నాయకులు, కార్యకర్తలను లోకేష్ పరామర్శిస్తారు.
సాయంత్రం 5.30 గంటలకు చంద్రగిరి చేరుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన టీడీపీ నాయకులు భాస్కర్, భాను ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు నివాళి అర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.సాయంత్రం 6.15 గంటలకు పెరుమాలపల్లె చేరుకొని రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేత సోమనాధ్ రెడ్డిని పరామర్శిస్తారు.
అయితే.. ఇప్పుడు కూడా లోకేష్‌ను అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు రెడీ అవుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ, దీనిని ఎలాగైనా ఎదుర్కొని టీడీపీ బలం ఏమిటో అధికార పార్టీకి తెలియజేయాలని.. లోకేష్ పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజా లోకేష్ పర్యటన ఆద్యంతం ఉత్కంఠగా మారింది.