టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు. విశాఖలో జరిగింది లోకల్ ఫేక్ సమ్మిట్ అని, జగన్ ని చూసి ఎవరు పెట్టుబడులు పెట్టరని ఎద్దేవా చేశారు. జగన్ సాక్షి మీడియా, భారతి సిమెంట్ తప్ప ఏపీలో మరెవరు బాగుపడలేదని లోకేష్ ఎద్దేవా చేశారు.
అమర్ రాజా, లులు, జాకీ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లాయని, దానికి కారణం జగన్ పాలనని దుయ్యబట్టారు. విశాఖ సమిట్ బూటకమని, దానివల్ల ఉద్యోగాలు పెట్టుబడులు ఏమీ రావని అన్నారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీల విస్తరణకు ప్రభుత్వ సహకారం లేదని , అన్ని వర్గాలపై దాడులు పెరిగాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అటువంటి సందర్భంలో 175కు 175 సీట్లు ఎలా గెలుస్తావని జగన్ ను ప్రశ్నించారు.
మంగళగిరిలో టీడీపీ రెండుసార్లు మాత్రమే గెలిచిందని, పార్టీ బలహీనంగా ఉంది కాబట్టే అక్కడ తాను పోటీ చేశానని లోకేష్ చెప్పారు. కుప్పంలో పోటీ చేయాలని చంద్రబాబు చెప్పినా…పార్టీ బలహీనంగా ఉన్న మంగళగిరినే తాను ఎంచుకున్నానని అన్నారు. పులివెందులలో జగన్ గెలవడం గొప్పకాదని, దమ్ముంటే వైసీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గంలో జగన్ పోటీ చేసి గెలవాలని లోకేష్ సవాల్ విసిరారు.
అంత బలం ఉన్న నేత విజయమ్మ విశాఖలో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. వివేకాను టీడీపీ నేతలు చంపించారని ఆరోపించారని, ఇప్పుడు సీబీఐ విచారణకు వైసీపీ నేతలు హాజరవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీడీపీ పొత్తులపై జగన్ కు భయం ఎందుకని నిలదీశారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుందనడానికి ఇదే నిదర్శనం అన్నారు.