‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష ఈ రోజు రాత్రి 8గంటలకు ముగియనుంది. దీక్ష ముగింపు సందర్భంగా చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు, కార్యకర్తలు భారీగా దీక్షా స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. జగన్ నువ్వు మగాడివైతే…మీ చిన్నాన్నను ఎవరు చంపారో విచారణ జరిపి వెంటనే శిక్ష వేయించూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ లా తానేమీ చిన్నాన్న జోలికి వెళ్లలేదని జగన్ నుద్దేశించి సెటైర్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్ లో గంజాయి పరిశ్రమ పేట్రేగిపోతోందని, యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. గంజాయి గురించి ప్రశ్నించినందుకు పోలీసులు దన్నుతో టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయని లోకేశ్ ఆరోపించారు. పసుపు జెండా, కండువా చూస్తే వైసీపీ నేతలకెందుకంత భయం? అని లోకేశ్ ప్రశ్నించారు. పోలీసులు లేకుండా వైసీపీ నేతలు బయటకు రాగలరా అని లోకేశ్ సవాల్ విసిరారు.
చంద్రబాబుది గాంధేయ మార్గంఅని, కానీ, టీడీపీ యువరక్తం అలా కాదని అన్నారు. ఒక చెంప మీద కొడితే …తిరిగి రెండు చెంపలు వాయగొడతామని, అన్నీ గుర్తు పెట్టుకుంటామని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాలో కాదు…భారత దేశంలో ఎక్కడా వైసీపీ నేతలను తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఏ ముహూర్తంలో ఈ పార్టీ పెట్టారో తెలీదని, కానీ, టీడీపీలో ఉన్నది కార్యకర్తలు కాదని, ఇది పసుపు సైన్యం అని లోకేశ్ కార్యకర్తల్లో జోష్ నింపారు. 2024లో టీడీపీదే అధికారం అని అన్నారు. తనపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టారని, అలాంటి సెక్షన్లతో కేసులు పెడితే ఈ బండి ఇంకా స్పీడ్ గా దూసుకుపోతుందని డీజీపీని ఉద్దేశించి మండిపడ్డారు.
ఇది ట్రైలర్ మాత్రమే అని…..2024 ఎన్నికలలోపు మరో రెండున్నరేళ్లు అసలు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారని, 2024లో మంగళగిరిలో టీడీపీని గెలిపించి కానుకగా ఇస్తానని లోకేశ్ అన్నారు.