2014-19 మధ్యకాలంలో ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ముసుగులో భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్ ఐటీ శాఖా మంత్రిగా ఉన్న సమయంలో భారీ అక్రమాలు జరిగినట్లు, భారీగా నిధులు దారి మళ్లించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే 26 మందికి నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో, లోకేష్ పై జగన్ తో పాటు వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను 24 గంటల్లో బయటపెట్టాలని ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు చేసి పారిపోవడం వైసీపీ నేతల నైజం అని, వైసీపీ నేతల మాదిరిగా అందరూ అవినీతిపరులేనని ప్రజలను వారు మభ్యపెడుతున్నారని లోకేష్ ఆరోపించారు.
మూడున్నరేళ్ల పాలనలో చంద్రబాబుపై, తనపై చేసిన ఆరోపణల్లోనూ వాస్తవం లేదని, ఎన్నో విచారణలలో ఇది తేలిందని అన్నారు. తాము వైసీపీ నేతలలాగే అవినీతికి పాల్పడి చిప్పకూడు తింటామనుకోవడం వారి అవివేకమని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్, ఫైబర్ గ్రిడ్, ఐటి కంపెనీలకు రాయితీలు, వంటి పలు విషయాలలో తనపై అవినీతి బురదజల్లారని, కానీ, ఏ ఒక్క ఆరోపణలోనూ ఆధారాలు చూపలేక పారిపోయారని అన్నారు.
చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. జగన్ కు పాలన చేతగాక ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ స్కామ్ అని కొత్త కథ మొదలెట్టారని ఆరోపించారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను రెడీ అని, 24 గంటలలో ప్యాలెస్ పిల్లితో పాటు వైసీపీ పిల్లులు ఆధారాలు బయటపెడతాయో పారిపోతాయో చూద్దమని సవాల్ విసిరారు.