రాష్ట్ర ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ దసరా పండుగను సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా జరపాలని పిలుపునిచ్చారు. రావణాసుర దహనం బదులు జగనాసుర దహనం చేద్దామని అన్నారు. అక్టోబరు 23న రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు ‘సైకో పోవాలి’ అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు. జగన్ అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్నారని, సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దామని లోకేష్ పిలుపునిచ్చారు.
విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విడుదల కావాలని, కరువు బారిన పడిన రాష్ట్ర ప్రజలు కోలుకునే శక్తినివ్వాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించానని అన్నారు. చంద్రబాబు తెలుగు జాతి ఆస్తి అని, తెలుగు పిల్లల ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు.