సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరుకుందని లోకేష్ నిప్పులు చెరిగారు. మహనీయులను అవమానిస్తున్న జగన్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. విజయనగరంలోని మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరును మార్చి ప్రజల మనోభావాలను జగన్ దెబ్బతీశారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరునను వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చి జగన్ పెద్ద తప్పు చేశారని ఫైర్ అయ్యారు. విజయనగరం నడిబొడ్డున కోట్ల రూపాయల విలువజేసే భూమిని ఆసుపత్రికి ఇచ్చింది మహారాజా కుటుంబమని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆ ఆసుపత్రికి నిధులను కేటాయించి అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసింది టీడీపీ నేతల అశోక్ గజపతిరాజు అని చెప్పారు.
కానీ, అవన్నీ మర్చిపోయిన జగన్ రాత్రికిరాత్రి మహారాజా పేరును తొలగించారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లోకేష్ అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆసుపత్రికి మహారాజా పేరును కొనసాగించాలని లోకేష్ డిమాండ్ చేశారు. కాగా, ఈ పేరు మార్పు వ్యవహారంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాన్సాస్ ట్రస్టు విషయంలో అశోక్ గజపతి రాజును జగన్ ఇరుకునపెట్టాలని చూసి భంగపడ్డారని, అందుకే ఇలా పేర్లు మార్చి పైశాచికానందం పొందుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.
పేరు మార్చినంత మాత్రాన పూసపాటి కుటుంబంపై జనానికి ఉన్న అభిమానం తగ్గదని, వారు చేసిన సేవలను విజయనగరం జిల్లా వాసులు ఎప్పటికీ మరచిపోరని కామెంట్స్ చేస్తున్నారు. జగన్ మనసు మార్చుకొని ఈ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.