టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు తరలించిన సిఐడి అధికారులు ఆయనను సిట్ కార్యాలయానికి తరలించారు. చంద్రబాబును హాజరు ఏసీబీ కోర్టులో వాదనలు జరగనున్నాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించబోతున్నారు.
అయితే, చంద్రబాబును కలిసేందుకు ఆయన తరపు న్యాయవాదులు ప్రయత్నించగా సిట్ కార్యాలయంలోనికి వారిని అనుమతించలేదు. ప్రభుత్వం తరఫు న్యాయవాదులను అనుమతించి తమను ఎందుకు అనుమతించడం లేదని చంద్రబాబు తరఫు లాయర్ల ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే తన లాయర్లను అనుమతించాలని సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారికి చంద్రబాబు లేఖ రాశారు. ఇక, చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరితో పాటు నారా లోకేష్ అక్కడికి చేరుకున్నారు. అయితే, పోలీసులు వారిని లోపలికి అనుమతిస్తారా లేదా అన్న విషయం తేలాల్సి ఉంది.
మరోవైపు, చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా విస్మయం వ్యక్తం చేశారు. మీడియాలో చూసిన తర్వాత చంద్రబాబు అరెస్ట్ గురించి తనకు తెలిసిందని ఆయన ఆశ్చర్యపడినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి అవినీతి నిరోధక చట్టం 2018 అనుసరించి అవినీతి జరిగినట్లుగా ప్రభుత్వం నిర్ధారిస్తే మొదటగా గవర్నర్ కు నివేదిక ఇవ్వాలి. అయితే, 2021 లో ఈ కేసు నమోదు అయినప్పటికీ గవర్నర్ కు ఈ కేసు గురించి తెలియక పోవడం విశేషం.
మరోవైపు, చంద్రబాబుపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో, ఈ సెక్షన్ ప్రకారం చంద్రబాబుకు స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొద్ది సేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించబోతున్నారు. చంద్రబాబు బెయిల్ విషయంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే సిట్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.