ఎన్నో అడ్డంకులు, మరెన్నో ప్రతికూలతలు అధిగమించి యువగళం పాదయాత్రను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్విజయంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా భోగాపురంలో రేపు ‘యువగళం-నవశకం’ విజయోత్సవ సభ జరగనుంది, ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు టీడీపీ నేతలు, జనసేన నేతలు హాజరు కాబోతున్నారు. తొలిసారిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు ఒకే వేదికపై కనిపించబోతున్న నేపథ్యంలో ఈ సభ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
110 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ జరగనుంది. 8 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. వేదికపై సుమారు 600 మంది కూర్చునే వెసులుబాటు ఉంది. సభా వేదిక ఎదురుగా వీఐపీల గ్యాలరీ ఉంటుంది. సభ వీక్షించేందుకు కుర్చీలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 6 లక్షల మంది ఈ సభకు హాజరయ్యే అవకాశముంది. సభ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. ఈ సభ కోసం టీడీపీ 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాల్లో టీడీపీ, జనసేన అభిమానులు సభా స్థలికి చేరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే యవగళ పాదయాత్ర ముగించుకున్న లోకేష్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో తన ఓటమికి గల కారణాలను లోకేష్ విశ్లేషించారు. 2019 ఎన్నికలకు మరో 21 రోజుల సమయం ఉందనగా తాను మంగళగిరికి వచ్చానని, అందుకే అక్కడి సమస్యలపై అవగాహన పెంచుకోలేకపోయానని చెప్పారు. ఎన్నికలకు ఏడాది ముందే మంగళగిరి వచ్చి ఉంటే అక్కడి ప్రజలకు లోకేష్…లోకేష్ కు అక్కడి ప్రజల సమస్యలు తెలిసేవని చెప్పుకొచ్చారు. అయితే, గతంలో రెండు సార్లు మాత్రమే మంగళగిరిలో టీడీపీ గెలిచిందని, పార్టీకి అంతగా పట్టులేని ఆ నియోజకవర్గంలో గెలిస్తేనే తన సత్తా తెలుస్తుందని అక్కడ పోటీ చేశానని లోకేష్ చెప్పారు.
కానీ, ఓటమి తర్వాత తాను కుంగిపోలేదని, మంగళగిరి ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తున్నానని లోకేష్ చెప్పారు. రాబోయే ఎన్నికలలో 53 వేల ఓట్ల మెజారిటీతో మంగళగిరి నుంచి గెలుపొందుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, వైసీపీ నియంతృత్వ పాలనకు యువత విసిగిపోయారని, తమ గొంతుక వినిపించేందుకు ఓ వేదిక కావాలని తన దగ్గరకు వచ్చారని, అలా యువగళం పుట్టిందని, అనతి కాలంలోనే అది ఆంధ్రా గళంగా మారిందని లోకేష్ అన్నారు. పాదయాత్రలో స్వయంగా ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నానని, వారి సమస్యలపై అవగాహన పెంచుకున్నారని లోకేష్ చెప్పారు. జగన్ మాదిరి హామీలు ఇచ్చి మర్చిపోబోమని, సంక్షేమం-అభివృద్ధి కలిపి అమలు చేస్తామని చెప్పారు.