లోకం ఎలా ఉన్నా.. చుట్టూ మరెలాంటి పరిస్థితులున్నా.. పట్టించుకోకుండా తమ పాటికి తాము బతికే తీరు మందుబాబుల్లో కనిపిస్తూ ఉంటుంది.
సామాన్యుడు మొదలు సెలబ్రిటీ వరకు.. మద్యం సేవించేవారి లక్షణం ఒకేలా ఉంటుంది.
ఇంతటి కలిసికట్టుతనం.. ఒకే తరహాలో స్పందించటం వారిలో మాత్రమే కనిపిస్తుంది. ఇదే.. లాక్ డౌన్ ప్రకటన వచ్చిన గంటల్లో మద్యం దుకాణాల వద్ద బారులు తీరటమే కాదు.. రికార్డు మొత్తంలో ఒక రోజు అమ్మకాలు సాగాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే.. మద్యం దుకాణాల వద్ద కనిపించిన సందడి అంతా ఇంతా కాదు.
ఇప్పుడు మిస్ అయితే.. మరెప్పటికో ఛాన్సు అనుకున్నారో కానీ.. వైన్స్ ముందు ప్రజలు బారులు తీరారు. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి సీనే కనిపించింది.
పోటెత్తినట్లుగా సాగిన జనసందోహంతో వైన్స్ షాపుల్లో స్టాక్ మొత్తం అయిపోయింది. లాక్ డౌన్ నేపథ్యంలో పది రోజుల పాటు షాపులు ఉండవన్న ప్రచారం సాగటంతో ఇంత భారీగా అమ్మకాలు సాగినట్లుగా చెబుతున్నారు.
అయితే.. మిగిలిన షాపుల మాదిరే.. మద్యం దుకాణాలు సైతం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు తెరిచే ఉంచుతారని ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చినప్పటికి.. ఎవరికి తోచినంత వారు.. మద్యాన్ని కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యత ఇచ్చారు.
దీంతో.. మంగళవారం లాక్ డౌన్ ప్రకటించే సమయానికి రూ.56 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి తరలిపోగా.. ఆ తర్వాత రాత్రి పది గంటలలోపు మరో రూ.69 కోట్లు.. అంటే మొత్తంగా రూ.125 కోట్ల మద్యం షాపులకు తరలి వెళ్లింది.
వచ్చిన స్టాక్ వచ్చినట్లుగా అయిపోవటంతో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి.
రోజు గడిచేసరికి షాపులన్ని ఖాళీగా బోసిపోయాయి.
రాష్ట్రం మొత్తంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.24.2 కోట్ల మద్యం ఒక్కరోజులో అమ్ముడు కాగా.. రెండో స్థానంలో మెదక్ రూ.15.24 కోట్లు.. మూడోస్థానంలో ఖమ్మం రూ.12.25కోట్లు.. నాలుగో స్థానంలో మెదక్ రూ.10.97 కోట్లు.. హైదరాబాద్ లో రూ.10.17 కోట్ల మొత్తంలో మద్యం అమ్మకాలు సాగాయి.
రోజువారీ అమ్మకాలతో పోలిస్తే.. మంగళ వారం డబుల్ అమ్మకాలు సాగాయి. అదే లాక్ డౌన్ ప్రకటన కానీ మరికాస్త ముందుగా వచ్చి ఉంటే.. ఈ అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.