తెలంగాణలో లాక్డౌన్ విధిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బుధవారం నుంచి పదిరోజుల పాటు ఈ లాక్డౌన్ కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
నిత్యవసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలు కానుంది.
ఈ సమయంలో దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు.
అలాగే వ్యాక్సిన్ కొరత నివారించేందుకు టీకా కొనుగోలుకు గ్లోబర్ టెండర్లను పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం హఠాత్తుగా లాక్ డౌన్ విధించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ వ్యవధిలో తమ స్వస్థలాలకు ఎలా చేరుకుంటారని కోర్టు ప్రశ్నించింది.
గత ఏడాదిలా ఈసారి వలస కూలీలు ఇబ్బంది పడకూడదని కోర్టు హెచ్చరించింది.