తాను డిసైడ్ అయిన విషయాన్ని.. ప్రజల్ని కన్వీన్స్ చేసే వాదానా పటిమ దండిగా ఉన్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు.
తాను పందిని నంది అన్నా.. తాను నందిని పంది అన్నా.. అవును.. సారు చెప్పిన దాన్లో పాయింట్ ఉందన్నట్లుగా మాటల చతురత ఆయన సొంతం.
సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ.. కేసుల సంఖ్య తీవ్రత ఎక్కవై.. ఆసుపత్రుల్లో బెడ్ల దొరక్క నానా తిప్పలు పడుతున్న వేళలో.. లాక్ డౌన్ అనివార్యమన్న మాట గడిచిన కొద్దిరోజులుగా వినిపిస్తోంది.
ఎవరేం చెప్పినా.. లాక్ డౌన్ విషయంలో కేసీఆర్ ఇప్పటికే డిసైడ్ అయిన నేపథ్యంలో.. ఆ విషయంలో ఆయనకంటూ నిశ్చిత అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి.
సెకండ్ వేవ్ ను లాక్ డౌన్ విధించకుండానే అధిగమించాలన్న పట్టుదలతో ఉన్నారు. వాస్తవానికి ఏప్రిల్ రెండో వారంలో కానీ ఆయన లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకొని ఉంటే.. ఇవాల్టి రోజున తెలంగాణలో ఇన్ని కేసులు నమోదు అయి ఉండేవి కాదన్న అభిప్రాయం ఉంది.
కానీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులో పడుతుందన్న ఆలోచన ఆయన్ను లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకోకుండా చేశాయి.
ఇప్పుడు అన్ని వర్గాల్లో కేసుల పెరుగుదలకు లాక్ డౌన్ విధించకపోవటమన్న భావన ఉండటమే కాదు.. టీకాలు.. ఆక్సిజన్.. రెమ్ డెసివిర లాంటి ఔషధాలకు ఇబ్బందిగా ఉన్న విషయాన్ని వైద్య ఆరోగ్య వర్గాలు స్పష్టం చేయటంతో లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకునే అంశంపై ముఖ్యమంత్రి తాజాగా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు.
నిజానికి.. లాక్ డౌన్ విధించాలన్న ఆలోచన చేయాలని హైకోర్టు ఇప్పటికే సూచన చేసింది. అయితే.. అలాంటి పరిస్థితి లేదన్న మాటను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.
ఇప్పటికే అమల్లో ఉన్న రాత్రిపూట కర్ఫ్యూతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని.. కేసుల కట్టడికి సంపూర్ణ లాక్ డౌన్ తోనే సాధ్యమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
దీంతో.. ఈ అంశంతో పాటు మరిన్ని అంశాలపై నిర్ణయాన్ని తీసుకోవటానికి వీలుగా ఈ రోజు (మంగళవారం) కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
లాక్ డౌన్ విధిస్తే ధాన్యం కొనుగోలు మీద పడే ప్రభావం.. తదితర అంశాలపై కూడా ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పినా వినకుండా.. పరిస్థితి లాక్ డౌన్ వరకు తెచ్చుకున్న వైనం చూస్తే.. మొండితనం కొన్నిసార్లు ఎంత ఇబ్బందిగా మారుతుందన్నది అర్థం కాక మానదు.
మరిప్పటివరకు లాక్ డౌన్ అవసరం లేదన్న కేసీఆర్.. ఇప్పుడు ఎలాంటి వాదనను వినిపిస్తారో చూడాలి.