అనుకున్నదే జరుగుతోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. వాటి కట్టడికి పాక్షిక లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదన్న మాటకు తగ్గట్లే..పలు రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. నిజానికి.. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించలేదు కానీ.. రాష్ట్రాలు ఎవరికి వారు.. వారికి తోచిన రీతిలో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోక్యంతో పాటు.. రాష్ట్రంలో కేసుల తీవ్రత భారీగా పెరిగిపోతున్న వేళ.. లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారు సీఎం కేసీఆర్.
ఉదయం పది గంటల నుంచి అన్ని కార్యకలాపాల్ని రద్దు చేస్తూ.. అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా లాక్ డౌన్ అమలు చేయటం తెలిసిందే. తాజాగా లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వరకు ఇప్పుడు అమలు చేస్తున్న లాక్ డౌన్ ను యథాతధంగా అమలు చేయనున్నట్లుగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వును మరికాసేపట్లో వెలువరించనున్నారు.
లాక్ డౌన్ పొడిగింపునకు సంబంధించిన నిర్ణయాన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తీసుకున్నట్లు చెబుతున్నారు. లాక్ డౌన్ పొడిగింపునకు సంబంధించి మంత్రులతో ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం మీద తీవ్ర ప్రభావం పడుతున్నా.. ప్రజల ప్రాణాల్ని.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం.. వచ్చే నెల పదిహేను వరకు లాక్ డౌన్ అమలు తప్పనిసరన్న మాట వినిపిస్తోంది. కేసుల కట్టడికి ఆ మాత్రం సమయం అవసరమని చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే.. తాజా పొడిగింపు నిర్ణయం ఉందంటున్నారు.