ఏపీలో స్థానిక సంస్థల వ్యవహారం సస్పెన్స్ సినిమాను మరపించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో లోకల్ వార్ కు ఎస్ఈసీ సిద్ధమైంది. మరోవైపు, కరోనా, వ్యాక్సిన్ కారణంగా ఎన్నికల నిర్వహణ కష్టమంటోంది ఏపీ సర్కార్. ఈ వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరడంతో ఎస్ఈసీతో ప్రభుత్వం చర్చించాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. కానీ, ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీదే తుది నిర్ణయమని చెప్పింది. దీంతో, ఎన్నికల నిర్వహణకు ఏమాత్రం సుముఖంగా లేని ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తాజాగా ఏపీ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏపీ స్థానిక సంస్థల్లో మరో 6 నెలల పాటూ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ జాప్యంతో స్పెషల్ ఆఫీసర్ల పాలనను ప్రభుత్వం పొడిగించింది. దీంతో, ఏపీలోని మండల పరిషత్లో జూలై 3, జెడ్పీలో జూలై 4 వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది. తాజా నిర్ణయంతో ఏపీలో మరో 6 నెలల పాటూ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు.
వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే, 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. సమయాభావం వలన స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. దీంతో, ఏడాదిన్నరకు పైగా జడ్పీ, మండలపరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలన సాగింది. గత ఏడాది స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనా కూడా కరోనా పరిస్థితులతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో, 6 నెలలకు ఒకసారి ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే జనవరి 4, 5 తేదీల్లో ప్రత్యేక అధికారుల పాలన ముగియనుంది. దీంతో తాజాగా మరో ఆర్నెల్లపాటు ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.