28 సంవత్సరాల సుదీర్ఘ వాదనల అనంతరం బాబ్రీ మసీదు కూల్చివేత కేసు ముగిసింది. లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులు అందరూ నిర్దోషులు అని, వాళ్లు కుట్ర చేశారు అనడానికి ఏ ఆధారాలు లేవు అని 2000 పేజీల ఆర్డర్ కాపీతో న్యాయమూర్తి తీర్పును వెలువరించారు.
తాజా తీర్పు నేపథ్యంలో బీజేపీ లో పండగ వాతావరణం నెలకొంది. ఈ కేసులో బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, రాజకీయ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ సహా 49 మంది నిందితులు ఉండగా వారిలో కొందరు మరణించారు. అయితే…. మొత్తం నిందితులు అందరూ నిర్దోషులేనని లక్నో సీబీఐ కోర్టు కీలక తీర్పునిచ్చింది. దీంతో 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించినట్లయ్యింది. అందరిపై అభియోగాలను కోర్టు కొట్టివేసింది.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… కూల్చివేత ఎలా జరిగింది, ఎవరు కుట్ర చేశారు… అసలు కుట్రా కాదా అనే విషయాలపై ఉన్న సందిగ్దతను తొలగించడంలో సీబీఐ అభియోగాలకు తగిన సాక్ష్యాధారలు లేనందున ఈ అభియోగాలను కొట్టివేస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు. కాబట్టి నిందితులంతా నిర్దోషులేనని కోర్టు ప్రకటించింది.
ఇదిలా ఉండగా, వయసు మళ్లి అద్వానీ వంటి వారికి, కరోనా బారిన పడిన వారికి తప్ప.. అందరినీ కోర్టుకు పిలిపించారు. మొత్తం ఈ కేసులో 49 మంది నిందితులుండగా… విచారణ కాలంలోనే 17 మరణించారు. వివిధ కారణాలు మినహాయింపులతో బతికున్న 32 మంది నిందితులలో 11 మంది హాజరుకాలేదు. 92 సంవత్సరాల అద్వానీ, 86 ఏళ్ల జోషిలకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు దక్కింది.
ఇదిలా ఉండగా… 1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేసిన విషయం తెలిసిందే. అది దేశాన్ని ఊపేసింది. ప్రభుత్వాలు అల్లాడిపోయాయి. ఒక ముఖ్యమంత్రి తన పదవి కోల్పోయారు. ఆ ఘటన బీజేపీ తలరాతను మార్చేసింది. కూల్చివేత అనంతర మత ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 3 వేల మంది ప్రాణాలను కోల్పోవడం ఈ కేసులో అతి కీలకమైన విషాద ఘట్టం.