దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. ముఖ్యమంత్రి నితీశ్ కు కొత్త తలనొప్పిగా మారనున్నట్లు చెబుతున్నారు. ఎన్డీయే మిత్రుడు లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జేపీ) తీసుకున్న నిర్ణయం నితీశ్ కు ఇబ్బందిగా మారనున్నట్లు చెబుతున్నారు. బిహార్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి నుంచి తాము వైదొలుగుతున్నామని.. అయితే.. బిజేపీతో మాత్రం తమ స్నేహం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.
నితీశ్ కు కటీఫ్ చెప్పిన వారు.. బీజేపీతో మాత్రం స్నేహం చేస్తామని చెబుతున్నారు. ఎన్నికల వేళ.. జేడీయూ పోటీ చేసే చోట్ల తమ పార్టీ అభ్యర్థులు బరిలోకి దింపుతామని.. అదే సమయంలో బీజేపీ పోటీ చేసే స్థానాల్లో మాత్రం తాము బరిలో నిలవమని వారు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. ఎన్నికల తర్వాత బీజేపీ – ఎల్ జేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న జోస్యాన్ని చెబుతున్నారు.
నితీశ్ ను మొదట్నించి వ్యతిరేకించే ఎల్ జీపీ.. తాజాగా ఆయన్ను సీఎం అభ్యర్థిగా అంగీకరించమని కరాఖండిగా చెబుతోంది. బిహార్ ఎన్నికల్లో జేడీయూ.. బీజేపీలు రెండూ చెరి సగం స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. తమ పార్టీ బీజేపీ పోటీ చేసే స్థానాల్లో పోటీ చేయదని ఎల్ జీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. జేడీయూ ఎక్కడైతే బరిలో నిలుస్తుందో.. అక్కడ తాము పోటీ చేస్తామంటున్నారు. ఈ నిర్ణయం అధికార జేడీయూకు ఇబ్బందిగా మారటం ఖాయమంటున్నారు.
నితీశ్ అంటే ఏ మాత్రం పడని ఎల్ జీ తాజా నిర్ణయం వెనుక ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ – ఆర్జేడీ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో బిహార్ అసెంబ్లీ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.