సాధారణంగా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో ఘన విజయం సాధించిన వైసీపీ, తద్వారా ఏర్పడిన ప్రభుత్వం ఎంతో స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రజలు మాండేట్ ఇచ్చిన ఆ పార్టీ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించాలి. ఇటువంటి పార్టీని ప్రశ్నించాలంటే ప్రతిపక్షాలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అయితే, ఏపీలో మాత్రం అఖండ మెజారిటీతో విజయం సాధించిన వైసీపీ సర్కార్ తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.
ఏ మాత్రం ఆలోచన లేకుండా సీఎం జగన్ తీనుకునే నిర్ణయాల వల్ల….ప్రభుత్వంపై ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. మరో వైపు రాజ్యాంగవిరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోన్న ప్రభుత్వానికి న్యాయస్థానాలు మొట్టికాయలు వేయాల్సిన దుస్థితి వచ్చింది. జగన్ తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల ఏపీ ప్రభుత్వం పలుమార్లు హైకోర్టు,సుప్రీం కోర్టు గడప తొక్కి భంగపడింది.
ఈ క్రమంలోనే ప్రతి నెలా ఏదో ఒక కేసు లేదంటే రెండు, మూడు కేసులలో ఏపీ సర్కార్ విచారణను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇక, తన బెయిల్ రద్దు వంటి వ్యవహారాల్లో వ్యక్తిగతంగా జగన్ ఎదుర్కొనే కేసులు వీటికి అదనం. ఈ నేపథ్యంలోనే జులై నెల జగన్ కు పెద్దగా అచ్చిరాదన్న టాక్ వినిపిస్తోంది. జులైలో జగన్, ఏపీ సర్కార్ కు సంబంధించిన పలు కేసులు విచారణకు రానున్నాయి.
జులై 1న జగన్ బెయిల్ రద్దు కేసును సిబిఐ కోర్ట్ విచారణ జరపనుంది. జులై 2న ABN ఆంధ్రజ్యోతి & టివీ 5ల కేసు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఇక, జులై 9న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని కస్టడీలో గాయపరిచారన్న ఆరోపణల కేసును సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. జులై 23ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణగారి పై జగన్ లెటర్ రాసిన కేసు విచారణ జరగనుంది. ఈ మధ్యలో ఏపీ హైకోర్టులో అమూల్ కేసు, సరస్వతి సిమెంట్స్ భూములు కేసు విచారణకు రానున్నాయి. మొత్తంగా చూసుకుంటే, జులైలో జగన్ కు కష్టాలు తప్పేలా లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.