దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనపై పెట్టిన కేసులను తానే కొట్టివేసుకున్న వైనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. విపక్ష నేతగా ఉన్న తనపై పెట్టిన 11 క్రిమినల్ కేసులు తప్పుడు కేసులని, వాటికి సాక్ష్యాలు లేవని ప్రాసిక్యూషన్ ను ఉపసంహరించుకుంటూ స్వయం ప్రకటిత జస్టిస్, ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఈ నిర్ణయంపై హైకోర్టు సుమోటో విచారణ ప్రారంభించగా…సుమోటోగా విచారణ చేపట్టడాన్ని ఏపీ సర్కార్ ఆక్షేపించింది. ఈ కేసులో రేపు హైకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఏం జరగబోతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే జగన్ పై నమోదైన కేసుల వివరాలేంటి…అవి కొట్టివేయదగ్గ కేసులా కాదా అన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.
జగన్ పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలివే…
* 2016 మార్చి 9న జగన్ వర్గవైషమ్యాలు పెంచేలా వ్యాఖ్యలు చేశారని మంగళగిరి రూరల్ పీఎస్‌లో కేసు నమోదైంది.
* 2016 జూన్ 3న అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన రైతు భరోసా యాత్రలో చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. చంద్రబాబు గ్రామాల్లోకి వస్తే చెప్పులతో కొట్టాలని జనాన్ని రెచ్చగొట్టారంటూ జగన్ పై మరో క్రిమినల్ కేసు నమోదైంది.
* అదే రోజు పుట్టపర్తిలో పర్యటించిన జగన్.. ప్రజల్నిరెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని అర్బన్ పీఎస్‌లో మరో కేసు నమోదైంది.
* రెండు రోజుల తర్వాత ఇదే జిల్లా కదిరిలో చంద్రబాబును చచ్చేనరకూ చెప్పులతో కొట్టాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది.
* 2016 జూన్ 6న అనంతపురం సప్తగిరి సర్కిల్లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది.
హైకోర్టు సుమోటో విచారణ పరిధిలోకి రాని మరో నాలుగు కేసులివే
* పులివెందులలో 2011 అక్టోబర్ 9న అల్లర్లకు పాల్పడటం, మారణాయుధాలు కలిగి ఉండటం, ప్రభుత్వ ఉద్యోగి విధుల్ని అఢ్డుకోవడం వంటి ఆరోపణలపై జగన్‌పై కేసు నమోదైంది.
* 2015 జూన్ 8న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల వినియోగం వంటి కేసులు జగన్‌పై నమోదయ్యాయి.
* అదే రోజు నరసరావుపేట వన్‌టౌన్ పీఎస్‌లో ఇవే ఆరోపణలతో మరో కేసు నమోదైంది.
* 2017 ఫిబ్రవరి 28న కృష్ణాజిల్లా నందిగామలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం సందర్భంగా పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్‌ను బెదిరించినందుకు జగన్‌పై మరో కేసు నమోదైంది.