ఏపీ విపక్ష నేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. స్కిల్ స్కాం ఆరోపణలపై ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన మీద తాజాగా మరో కేసును నమోదు చేశారు. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు.. ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ ఆయనపై పీటీ వారెంట్ జారీ చేసింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసు రీఓపెన్ కు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తూ.. పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ఇప్పుడు మరో కేసు తెర మీదకు వచ్చింది.
గత ప్రభుత్వ హయాంలో పలు మద్యం కంపెనీలకు.. సరఫరా దారులకు అనుకూల నిర్ణయాలు తీసుకొని వారికి అనుచిత లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలపై బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన కంప్లైంట్ లో చంద్రబాబుతో పాటు అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఐ.శ్రీనివాస శ్రీనరేష్.. అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రలపైనా సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా పేర్కొంది. అప్పటి మంత్రి కొల్లు రవీంద్రను ఏ2గా.. శ్రీనివాస శ్రీనరేష్ ను ఏ1గా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగిగా వ్యవహరిస్తూ చట్టానికి లోబడి ఉండకపోవటం (సెక్షన్ 166).. పబ్లిక్ సర్వెంట్ తప్పుడు డాక్యుమెంట్ రూపొందించటం (ఐపీసీ 167).. నేరపూరితకుట్ర (ఐపీసీ 120బీ).. నేరపూరిత విశ్వాస ఘాతుకం (ఐపీసీ 409).. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(డి) రెడ్ విత్ 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుత కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఈ నెల పదకొండున ఫిర్యాదు చేయగా.. 28న సీఐడీలో కేసు నమోదైనట్లుగా పేర్కంటున్నారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ను సోమవారం విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సమర్పించారు.