దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మద్యపాన నిషేధం కోసం జగన్ అనుసరిస్తున్న విధానాలపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. మద్యపాన నిషేధం పేరుతో జగన్ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని నాసిరకం బ్రాండ్ లను ఏపీలో అమ్ముతున్నారని, ఆ నాసిరకం బ్రాండ్లు వైసీపీ నేతలకు చెందిన బినామీ కంపెనీలలోనే తయారవుతున్నాయని విమర్శిస్తున్నారు.
ఇక, మద్యపాన నిషేధం ఒట్టి బూటకమని, మద్యం షాపులను తగ్గించుకుంటూ పోతామని చెప్పిన జగన్..ఆ దిశగా అరకొర చర్యలు తీసుకొని సరిపెట్టారని విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో ఉన్న 4380 మద్యం షాపులను 2934కు జగన్ తగ్గించారు. అయితే, ఇదంతా రెండేళ్ల క్రితం జరిగింది. 2020 మేలో మద్యం షాపుల సంఖ్య తగ్గిన తర్వాత మరోసారి ఆ సంఖ్య తగ్గించే దిశగా జగన్ ఏ నిర్ణయం తీసుకోలేదు.
అయతే, ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీతో పాత మద్యం పాలసీ ముగుస్తోంది. దీంతో, మద్యపాన నిషేధం అని కంకణం కట్టుకున్న జగనన్న గతంలో మాదిరిగానే షాపుల సంఖ్య తగ్గిస్తారని అంతా భావించారు. కానీ, మద్యంపై వస్తున్న మనీ కిక్కుకు అలవాటుపడ్డ జగన్..ఆ దిశగా అడుగులు వేయకుండా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉన్న మద్యం పాలసీని యథాతధంగా మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు, గతంలో ఉన్ఈన 2934 షాపులను యథాతధంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ప్రకారం రాష్ట్ర అబ్కారీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శుక్రవారం జీవో నెంబరు 662 పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో ప్రస్తుతం రాష్ట్రంలో అమలు అవుతున్న మద్యం పాలసీ 2023 సెప్టెంబర్ 30 దాకా కొనసాగనుంది. దీంతో, మద్యపాన నిషేధం అంటూ జగన్ మహిళలను మోసం చేశారని విమర్శలు వస్తున్నాయి.