- తాగినోడికి తాగినంత పోయండి
- లిక్కర్ ఆదాయానికి టార్గెట్లు
- గంటకు 10 కోట్లు.. రోజుకు 84 కోట్లు
- నెలకు 2,500 కోట్లు ఆర్జించాల్సిందే
- ఎక్సైజ్ శాఖకు జగన్ సర్కారు హుకుం
- లేదు లేదంటూనే భారీ లక్ష్యాలు
- ఏడాదికి 30,500 కోట్లు అమ్మాలని ఆదేశం
మద్యపాన నిషేధం దశలవారీగా అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా మూడో వంతు దుకాణాలను తగ్గించారు. మద్యం ధరలు బాగా పెంచారు. పాపులర్ బ్రాండ్లు తీసేసి కనీవినీ ఎరుగని కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చారు. వాటిని ఎక్సైజ్ సిబ్బందితో అమ్మిస్తున్నారు. త్వరలోనే సగానికి తగ్గిస్తారనుకుంటే బార్ షాపుల్లో అమ్మకాలకు అనుమతిచ్చారు.
వాక్ ఇన్ స్టోర్లు కూడా ఏర్పాటుచేసి మద్యం విక్రయిస్తున్నారు. ‘మద్యం ధరలు వినగానే మందుబాబుల గుండె దడదడలాడాలి. లిక్కర్ ధరలు షాక్ కొట్టేలా ఉండాలి. అప్పుడే.. మద్యం జోలికి వెళ్లరు. వారు ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుంటారు’ అని ఏడాదిన్నర కింద ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇప్పుడు అంతా మారిపోయింది.
మద్యంపై ఆదాయమే సర్కారు మాట ఒక్కసారిగా తప్పింది. మడమ కూడా తిప్పింది. మద్యం ధరలను సగటున 20 శాతం చొప్పున తగ్గించేసింది.ఈ ఏడాది 30వేల కోట్ల అమ్మకాలు జరిపి.. రూ.25 వేల కోట్ల ఆదాయం సంపాదించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తొలి ఆరు నెలల్లో రూ.10 వేల కోట్లు వచ్చింది. మిగిలిన ఆరు నెలల్లో మరో రూ.15 వేల కోట్లు రాబట్టాలి. అంటే… అమ్మకాలు పెరగాలి. అందుకే ధరలు తగ్గించింది. అంటే ఇక మద్య నిషేధం ఉండదని నేరుగా చెప్పేసింది. అంతేకాదు.. అధికారులకు భారీగా టార్గెట్లు పెట్టింది. గంటకు పది కోట్ల రూపాయల వ్యాపారం చేయాలి.
రోజుకు రూ.84 కోట్ల కంటే అమ్మకాలు తగ్గకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా వారానికి రూ.585 కోట్లు అమ్మి తీరాలి. సంపూర్ణ మద్య నిషేధం మా విధానమని ప్రకటించిన జగన్ ఎక్సైజ్ శాఖకు నిర్దేశించిన లక్ష్యాలివి. మాకు మద్యం ఆదాయం ముఖ్యం కాదు అన్న రాష్ట్రంలో ఇలా టార్గెట్లు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో 20,895 కోట్ల విలువైన మద్యం రాష్ట్రంలో అమ్ముడైతే, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.30,535 కోట్లు మద్యం అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది కంటే ఏకంగా రూ.10 వేల కోట్ల మద్యం అమ్మకాలు పెంచడం అంటే అధికారుల గొంతుపై కత్తిపెట్టినట్లుగా కనిపిస్తోంది. రాత్రింబవళ్లు పనిచేసినా అంత ఎలా అమ్మాలని క్షేత్రస్థాయి యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.
షాపుల వర్గీకరణ
అమ్మకాల విలువ ఆధారంగా ప్రభుత్వం మద్యం షాపులను ఎ, బి, సి అంటూ మూడు రకాలుగా వర్గీకరించింది. ప్రతి వారం ఏ కేటగిరీలో ఎన్ని షాపులున్నాయనే వివరాలను సేకరిస్తోంది. అమ్మకాలు ఎక్కువగా ఉంటే ఎ, ఓ మాదిరిగా ఉంటే బి, తక్కువగా ఉంటే సి కేటగిరీగా పేర్కొంటోంది.
షాపులన్నీ ఎ కేటగిరీలోకి రావాలని, వారం వారం ఎన్ని షాపులు కేటగిరీలు మారుతున్నాయో నివేదిక రూపొందిస్తోంది. ప్రస్తుతం రోజుకు రూ.63 కోట్ల విలువైన మద్యం అమ్ముతుంటే, ఇప్పుడు రోజుకు రూ.84 కోట్లు అమ్మాలని టార్గెట్ పెట్టింది. ఈ మేరకు అన్ని జిల్లాలు టార్గెట్లు చేరుకోవాలని అధికారులను ఆదేశిస్తోంది. అమ్మకాలు తగ్గిన షాపులను అధికారులు తనిఖీలు చేస్తూ, ఎందుకు తగ్గాయని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు మందు కొనకపోతే తామేం చేయాలని ఎక్సైజ్ షాపుల్లోని సిబ్బంది నోరెళ్లబెడుతున్నారు.
25వేల కోట్ల ఆదాయం
మద్య నిషేధం అని చెప్పిన జగన్ ప్రభుత్వం అదే మద్యం అమ్మకాల్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులు సృష్టిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా రూ.18వేల కోట్ల ఆదాయం వస్తే, ఈ ఏడాది రూ.25వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది.
ఒక్క ఏడాదిలో రూ.7వేల కోట్లు అదనంగా రాబట్టాలనే ప్రయత్నం గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అందులోనూ మద్య నిషేధం అని పదే పదే చెబుతోన్న వైసీపీ ప్రభుత్వం ఆదాయంపై టార్గెట్లు పెట్టుకోవడం మరీ విడ్డూరంగా ఉంది.
గత ప్రభుత్వంలో 4380 షాపులుంటే వైసీపీ ప్రభుత్వం దశలవారీగా వాటిని 2934కు తగ్గించింది. అలాగే మద్యం షాపుల పనివేళలు కుదించింది. బెల్టు షాపులు రద్దు చేసినట్లు ప్రకటించింది. కానీ ఇన్ని చర్యలు తీసుకున్న తర్వాత కూడా అమ్మకాలు పెంచాలని ఎందుకు అనుకుంటోంది?
ఇక్కడ అమ్మకాలు పెంచుకోవడం కోసం పక్క రాష్ర్టాల నుంచి తెచ్చే మద్యంపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఇందుకోసం పక్క రాష్ర్టాల నుంచి ఒక్క సీసా మద్యం రాకూడదంటూ ఏకంగా ఎక్సైజ్ చట్టానికి సవరణ కూడా చేసింది. ఇదంతా తాగుడు తగ్గించడం కోసమేనని ప్రజలు నమ్మేలోపే ఇక్కడి షాపుల్లో అమ్మకాలు పెంచాలని టార్గెట్లు పెట్టింది.
అంటే పక్క రాష్ర్టాల నుంచి మద్యం తేవడాన్ని నిషేధించడంలో అసలు ఉద్దేశం తాగుడు తగ్గించడం కాదని, ఇక్కడి అమ్మకాలు పెంచడమేనని స్పష్టమైంది. అలాగే నాటుసారాపైనా పనిగట్టుకుని అదే పనిగా దాడులు చేయించడం కూడా అమ్మకాలు పెంచడంలో భాగమేనని అధికార వర్గాలు అంటున్నాయి.
సీఎస్ మందువారం..
ఏమయ్యా.. ఇవాళ ఎన్ని కేసులు బీర్లు అమ్మారు.. ఆ ఊర్లో తక్కువగా అమ్ముతున్నట్లుంది.. పోయిన వారం వచ్చినంత కూడా లేదే.. ఇలా వ్యాపారం జరిగితే డబ్బులెట్టా వస్తాయయ్యా… ఇలాగైతే అసలు కుదరదు.. ’మత్తు’ వదలండి.. అమ్మకాలు బాగా పెంచండి… జనానికి కిక్కు ఎక్కాలి.. మనకు లెక్క రావాలి.. ఈ విషయంలో తగ్గేదేలే.. ఇదేదో మద్యం వ్యాపారి తన దుకాణాల సిబ్బందికి ఇస్తున్న ఆదేశాలనుకుంటే పొరపాటే.
దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులకు అధిపతి.. 190 మంది ఐఏఎస్‌లు, మరో 110 మంది ఐపీఎస్‌లు ఆయన కనుసన్నల్లో మెలుగుతారు.. సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి, ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ. ఆయన ఈ ఆదేశాలిస్తున్నది జిల్లాల్లో సర్వాధికారులైన కలెక్టర్లకు. ఐఏఎస్ చదివి అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వీరు.. సీఎం జగన్ పుణ్యమా అని మద్యం అమ్మకాల లెక్కల్లో పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు గత నెల మొదట్లో వరద తాకిడికి అతలాకుతలమై అనేకమంది ప్రాణాలు కోల్పోయి వేలాది మంది నిరాశ్రయులైతే ఒక్కటంటే ఒక్కటి గట్టి సమీక్షా సమావేశం నిర్వహించని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.. మద్యం అమ్మకాలపై వారం వారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
ఏవారం లెక్క ఆ వారానిదే.. ఆదాయం ఎంతొచ్చింది.. ఈ వారం ఎంత పెంచారు.. సర్కారు మద్యం ఎంత తాగించారు.. ఇంకా తాగించాల్సిందే. ఎక్కడ తక్కువ తాగారు.. ఎందుకు వ్యాపారం తగ్గింది అనే వాటిపై క్షుణ్నంగా సమీక్షిస్తూ కలెక్టర్లకు కర్తవ్య బోధ చేస్తున్నారు.
జిల్లా మొత్తం ఒడిసి పట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుంచాల్సిన కలెక్టర్లు ఈ బీర్లు, బాటిళ్ల లెక్కలు చెప్పలేక సిగ్గుతో తల దించుకుంటున్నారు. అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు కూడా పుట్టక పోవడంతో ప్రజలను ఏదో ఒక రూపంలో పీడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు ఆకాశమంత పెంచేసింది.
అది చాలక విద్యుత బిల్లులు, ఇంటి పన్నులే కాదు.. చెత్త పన్ను నుంచి ఓటీఎస్ వరకూ దేన్నీ వదలడంలేదు. అయితే నిషేధిస్తామని చెప్పిన మద్యంపై భారీగా ధరలు పెంచి మూడు వేల షాపుల నుంచి 30 వేల కోట్ల రాబడి లక్ష్యంగా పెట్టుకున్న జగన్ సర్కార్ మద్యం వ్యాపారం పెంచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. గత ప్రభుత్వంలో సోమవారం రాగానే పోలవారం అంటూ ప్రాజెక్టు గురించి సమీక్షిస్తే… ఇప్పుడు మాత్రం సోమవారం అనగానే మందువారం అంటూ మద్యం అమ్మకాలపై సమీక్షిస్తున్నారు.