“రాష్ట్రంలోని పేద కుటుంబాలకు శాపంగా మారిన మద్యం అమ్మకాలను మేం అధికారంలోకి రాగానే విడతల వారీగా నియంత్రిస్తాం. అదేసమయంలో మద్యం ధరలు ముట్టుకుంటే.. షాక్ కొట్టే కరెంటు మాదిరిగా పెంచేస్తాం. దీంతో సామాన్యుడు మద్యం జోలికిపోవాలంటేనే భయపడే పరిస్థితి తీసుకువస్తాం“ ఇదీ ఎన్నికలకు ముందు.. అప్పటి వైసీపీ అధినేత, ప్రస్తుతం సీఎం జగన్ చేసిన ప్రకటన. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన వ్యవహారం.. `ఇంకా తాగండి.. ఇంకా ఇంకా తాగండి`-అన్నట్టుగానే ఉండడం గమనార్హం.
ఖజానా దెబ్బకు..
నిజానికి మద్యం అమ్మకాలను తగ్గిస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మద్యం దుకాణాలను ప్రభుత్వ పరం చేసి.. కొన్ని దుకాణాలు తగ్గించారు. అయితే.. సంక్షేమ పేరిట ప్రజలకు డబ్బులు పంచుతుండడంతో ఆదాయం లేక ఖజానా కొల్లబోయింది. దీంతో మద్యమే ప్రభుత్వాని ప్రధాన ఆదాయంగా మారిపోయింది. దీంతో వివిధ రూపాల్లో .. మద్యం షాపులకు అనుమతులు ఇస్తున్నారు. ఇప్పటికే.. పర్యాటకం పేరిట మాల్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నగరాలు, పట్టణాల్లో.. కూడా మాల్స్ పేరిట ఏసీ.. దుకాణాలు ఏర్పాటు చేశారు.
హామీ మేరకేనట!
ఇప్పుడు ఇవి చాలవన్నట్టుగా.. ఇకపై క్యాన్ బీర్లు, 90 ఎంఎల్ బుడ్డీలలో మద్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం .. ప్రస్తుతం రాష్ట్రంలో బీరును సీసాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు. 650 ఎంఎల్, 350 ఎంఎల్ సీసాల్లో బీరు దొరుకుతోంది. ఇప్పుడు… టిన్ బీర్లనూ అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అయితే.. ఇదంతా కూడా తమ వాగ్దానం మేరకు మద్యం వినియోగం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం గమనార్హం. కానీ, పరోక్షంగా మద్యం వినియోగాన్ని, అమ్మకాలను కూడా పెంచేస్తుండడం గమనార్హం
అసలు విషయం ఏమిటంటే
సీసాల్లో ఉన్న బీరును కొని బయట తాగడమే కష్టం. బరువుగా, పొడవాటి సీసాలను తీసుకెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుంది. టిన్ బీర్లు అలా కాదు. చేతిలో ఇమిడిపోతాయి. స్టైల్‌గా ఉంటాయి. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లి, అంతే సులువుగా తాగేయవచ్చు. 330 ఎంఎల్, 500 ఎంఎల్… ఇలా రెండు రకాల క్యాన్లలో బీరును అందుబాటులోకి తెస్తున్నారు. ఇలాంటి వెసులుబాటు కల్పిస్తూ కూడా… ‘మద్య వినియోగం తగ్గించేందుకే’ క్యాన్బీర్లు అందుబాటులోకి తెస్తున్నామనడం గమనార్హం. క్యాన్లతో బీర్ విక్రయాలు మరింత పెరుగుతాయని అధికారులే అంగీకరిస్తున్నారు.
90 ఎంఎల్ సీసాలు కూడా.
‘అక్రమ మద్యం రవాణా, నాటుసారా ప్రభావాన్ని తగ్గించేందుకు’ అంటూ సరిహద్దు గ్రామాల్లోని మద్యం దుకాణాల్లో ‘90ఎంఎల్’ మద్యం సీసాలను ఎక్కువగా అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం ఒక క్వార్టర్… అంటే 180 ఎంఎల్ సీసాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 90ఎంఎల్ సీసాలు చాలా తక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఒక క్వార్టర్ సీసా కొనాలంటే వినియోగదారుడు కనీసం రూ.200 పెట్టాల్సి వస్తోంది. దీంతో తక్కువ రేట్లకు వస్తున్నాయని పక్క రాష్ట్రం మద్యం, నాటుసారాకు మొగ్గుచూపుతున్నారని… అందుకే, సుమారు రూ.వందకే దొరికేలా ఇక్కడే 90ఎంఎల్ సీసాలు తెస్తే అక్రమ మద్యం తగ్గిపోతుందని అధికారులు వాదిస్తున్నారు.
తాజాగా పచ్చజెండా!
రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో క్యాన్ బీర్ విక్రయానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాన్ బీర్‌తో పాటు 90 ఎంఎల్ మద్యం అమ్మకాలకూ అనుమతిచ్చింది. అక్రమ రవాణా, నాటుసారా, గంజాయి వాడకం తగ్గించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆబ్కారీశాఖ పేర్కొంది. కెమికల్ ల్యాబ్స్ ఆధునికీకరణకు ల్యాబ్‌కు రూ.5 లక్షలు కేటాయించాలని అధికారులను ఆదేశించింది. లిక్కర్ వాక్ఇన్ స్టోర్సులో ధరల పట్టిక ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మద్యం స్టాక్ ఆడిట్‌కు స్వయం ప్రతిపత్తి కలిగిన ఆడిట్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.