ఇప్పటివరకు ఓటరు కార్డుకు.. ఆధార్ కార్డుకు లింకు లేని విషయం తెలిసిందే. అందుకు భిన్నంగా కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఓటరు ఐడీతో ఆధార్ ను లింకు చేయటం ద్వారా.. బోగస్ ఓట్లను ఏరివేయాలన్న యోచనతో పాటు.. 18 ఏళ్ల వయసు నిండినంతనే ఓటరుగా నమోదుకు అవకాశం కల్పించే కొత్త ఆలోచనను చేస్తోంది.
ఓటర్ ఐడీకి సంబంధించి కీలకమైన నాలుగు సంస్కరణలు చేయాలని భావిస్తున్నారు. వీటిని 2021 మొదట్లోనే పూర్తి చేయాలని.. ఇందుకు అవసరమైన బిల్లును త్వరలోనే పార్లమెంటులో పెట్టేందుకు వీలుగా కసరత్తు షురూ చేశారు. కొత్తగా చేయాలనుకున్న మార్పుల కోసం ప్రజాప్రతినిధ్య చట్టం 1951ను సవరించాల్సి ఉంటుంది. భారీగా ఉన్న బోగస్ ఓట్లతో పాటు.. డూప్లికేషన్ ఓట్లను ఎత్తివేయటానికి వీలుగా.. ఓటరు కార్డుతో ఆధార్ లింకేజీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ ఓటును అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
ఈ సంస్కరణలు పూర్తి అయితే.. ఇంటర్నెట్ ఆధారిత ఓటు వేసేందుకు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఓటర్ ఐడీతో ఆధార్ ను జత చేయటం ద్వారా గోప్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఈసీ వెల్లడించింది. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం ఏడాదిలో ఎప్పుడు 18 ఏళ్లు నిండినా.. ప్రతి ఏడాది జనవరి 1న మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటారు. అంటే.. ఒకరికి 2020 జులైలో 18 ఏళ్లు నిండినా.. ఓటర్ ఐడీ జారీకి పరిగణలోకి తీసుకోరు. 2021 జనవరి 1 తర్వాత మాత్రమే వారికి ఓటరు కార్డును ఇష్యూ చేస్తుంటారు.
కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణలో.. ఎవరైనా సరే తమకు 18 ఏళ్లు ఎప్పుడు పూర్తి అయితే.. అప్పుడే ఓటరు కార్డు తీసుకునేందుకు అవకాశం కల్పించేలా మార్పులు చేయనున్నారు. ఇందుకోసం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 14బిని సవరించాల్సి ఉంటుంది. ఈ మార్పుతో 18 ఏళ్ల వయసు నిండిన వెంటనే ఓటుహక్కు లభించే వీలుంది.