టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత తొలిసారిగా బహిరంగ సభ ప్రజాగళం చిలకలూరిపేటలోని బొప్పూడి దగ్గర జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ బహిరంగ సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పలువురు టీడీపీ నేతలు, బీజేపీ నేతలు, జనసేన నేతలు హాజరు కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చిలకలూరిపేటకు బయలుదేరారు. ఇక ఆల్రెడీ సభా ప్రాంగణానికి చంద్రబాబుతో పాటు, నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు చేరుకున్నారు.
సభా ప్రాంగణం వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు లక్షలాది మంది చేరుకోవడంతో అక్కడంతా ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. సభా వేదికపైకి పరిమిత సంఖ్యలోనే అన్ని పార్టీలకు చెందిన నేతలను అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి 14 మంది నేతలు వేదికపై ఆసీనులు కానున్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, అశోక్ బాబు, ఎంఏ షరీఫ్, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్ బాబు, తంగిరాల సౌమ్య, అనగాని సత్యప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ తరఫున వేదికపై కూర్చోబోతున్నారు. అయితే, నారా లోకేష్ మాత్రం సభా వేదికపై కాకుండా నేతలు, కార్యకర్తలతో కలిసి గ్యాలరీలో కూర్చోబోతున్నారు.
జనసేన నుంచి 9 మంది నేతలకు అవకాశం దక్కింది. పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, నాగబాబు, కొణతాల రామకృష్ణ, శివశంకర్, వెంకటేశ్వరరావు, బొమ్మిడి నాయకర్, కందుల దుర్గేష్, లోకం మాధవిలు వేదికపై కూర్చోనున్నారు. మోడీ కాకుండా ఆరుగురు బీజేపీ నేతలకు అవకాశం దక్కింది. దగ్గుబాటి పురందేశ్వరి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేష్, సుధాకర్ బాబులకు వేదికపై కూర్చునే అవకాశం కల్పించారు.
ప్రజాగళం సభ నేపథ్యంలో చిలకలూరిపేట నుండి బొప్పూడి సభా వేదిక వరకు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. మంగళగిరి టోల్గేట్ వద్ద వేల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. రద్దీ పెరగడంతో టోల్గేట్ నిర్వాహకులు కాసేపు గేట్లను ఎత్తివేశారు. ఇక ఈ సభలో ప్రధాని మోడీ 40 నిమిషాల పాటు ప్రసంగించబోతున్నారని తెలుస్తోంది. చంద్రబాబు 15 నిమిషాల పాటు, పవన్ కళ్యాణ్ 15 నిమిషాల పాటు ప్రసంగించనున్నారని తెలుస్తోంది. పదేళ్ల తర్వాత ఈ ముగ్గురు నేతలు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలనుద్దేశించి మోడీ ఏం చెప్పబోతున్నారు? సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై మోడీ విమర్శలు చేస్తారా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.