అయోధ్య రామ మందిర నిర్మాణం కోట్లాది మంది భారతీయుల కల. ఎన్నో దశాబ్దాల తర్వాత ఆ కల నెరవేరింది. 2024 జనవరి 22న అయోధ్యలో అంగరంగ వైభవంగా రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. బాల రాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడు. అప్పటి నుంచి అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే తాజాగా రామ మందిర పరిసర ప్రాంతాల్లో దొంగలు చేతివాటం చూపించారు.
అయోధ్యలో కొట్టేయడానికి ఇంకేం దొరకవన్నట్లు.. వీధి లైట్లు కొట్టేశారు దొంగలు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రామ మందిరానికి చేరుకునే భక్తిపథం, రామపథం మార్గాలను వెదురు స్తంభాలతో కూడిన లైట్లను అమర్చి ఎంతో సుందర్భంగా ముస్తాబు చేసింది. అయితే అందులో 3,800 వెదురు స్తంభాల లైట్లను, 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను గుర్తుతెలియని దుండగులు ఎత్తికెళ్లారు. వాటి విలువ రూ. 50 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.
అయోధ్యలోని రామజన్మభూమి పోలీస్ స్టేషన్లో కాంట్రాక్టర్ శేఖర్ శర్మ ఆగస్టు 9న ఫిర్యాదు చేయడంతో.. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం.. కృష్ణ ఆటోమొబైల్స్, యష్ ఎంటర్ప్రైజెస్ సంస్థలు రామ్‌పథ్‌లో 6,400 బాంబో లైట్లు, భక్తి పథ్‌లో 96 గోబో ప్రొజెక్టర్ లైట్లు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల తనఖీ చేయగా.. రూ. 50 లక్షలు విలువ చేసే లైట్లు చోరీ అయినట్లు తెలిసిందని శేఖర్ శర్మ ఫిర్యాదు పేర్కొన్నారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఓరి మీ దుంపలు తెగ వీధి లైట్లను కూడా వదలట్లేదా అంటూ నెటిజన్లు దొంగల చేతివాటానికి షాక్ అవుతున్నారు.