మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. వివేకా ఇంటి వాచ్ మన్ రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం మొదలు…..నిన్న సీబీఐ అధికారులను వైఎస్ సునీతా రెడ్డి కలవడం వరకు పలు నాటకీయ పరిణమాలు జరిగాయి. ఇక, ఈ కేసుకు సంబంధించి తమ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని, కేసు వదులుకోవాలని కొందరు హెచ్చరించారని గతంలోనే వైఎస్ సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నిన్ని సీబీఐ అధికారులతో పులివెందులలో భేటీ అయిన సునీత…తాజాగా మరోసారి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైఎస్ సునీత లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తమ ఇంటి దగ్గర అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ రెండుసార్లు తిరిగాడని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
తమ ఇంటి కాంపౌండ్ పక్కన ఉన్న ఇంటి డోర్ దగ్గర ఆగిన ఆ అనుమానితుడు…తనకు ఫోన్ చేశాడని సునీత వెల్లడించారు. తన తండ్రి హత్య కేసులో అనుమానితుడైన శివశంకర్‌రెడ్డి బర్త్ డే కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఈ వ్యక్తిని చూసినట్లు తనకు గుర్తుందని అన్నారు. ఈ విషయంపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయగా…ఆ వ్యక్తిని మణికంఠ రెడ్డిగా తేల్చారని లేఖలో రాశారు. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని, వివేకా కేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని అన్నారు. ఈ నేపథ్యంలో తన తండ్ర హత్య కేసులో శివశంకర్‌రెడ్డి పాత్రపై లోతుగా విచారణ జరపాలని కోరారు. అయితే, వివేకా హత్య కేసులో నేడు విచారణకు శివశంకర్‌రెడ్డి హాజరైైన నేపథ్యంలో సునీత లేఖ రాయడం విశేషం.