టాలీవుడ్ లో సింగర్ సునీతకు మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. నేపథ్య గాయనిగా, ఎందరో హీరోయిన్లకు వాయిస్ ఓవర్, డబ్బింగ్ చెప్పిన క్రెడిట్ సునీతకు దక్కుతుంది. అందుకే సునీతకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సునీత రెండో పెళ్లి వ్యవహారం కొద్ది నెలల క్రితం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేనిని సునీత పెళ్లి చేసుకోవడంపై ట్రోలింగ్ జరిగింది.
కేవలం డబ్బు కోసమే రామ్ ని సునీత పెళ్లి చేసుకున్నారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే, ఆ కామెంట్లకు సునీత, రామ్ దంపతులు దీటుగా బదులిచ్చారు. ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సునీత భర్త రామ్ వీరపనేని మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీసులకు రామ్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
లక్ష్మణ్ అనే వ్యక్తి తనను ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నిర్మాతల కౌన్సిల్ సభ్యుడిని, తనను వ్యక్తిగతంగా తనను కలవాలని లక్ష్మణ్ తనకు మెసేజ్ పెట్టినట్టుగా రామ్ ఫిర్యాదు చేశారు. అయితే, ఆ వ్యక్తి తనకు పరిచయం లేకపోవడంతో ఆ మెసేజ్ కు స్పందించలేదని, వ్యాపారపరంగా ఏదైనా చర్చించాలంటే తన టీంను కలవాలని బదులిచ్చానని చెప్పారు.
కానీ, వ్యక్తిగతంగా కలవాలంటూ పదేపదే లక్ష్మణ్ నుంచి మెసేజ్ లు రావడంతో ఆ నెంబర్ ను రామ్ బ్లాక్ చేశారు. అయితే, మార్చి 28న మరో కొత్త నెంబర్ తో అదే తరహాలో లక్ష్మణ్ మెసేజ్ లు పంపడం మొదలుపెట్టారు. అంతేకాకుండా, తనను కలవాల్సిందే అంటూ బెదిరింపులకు దిగడంతో రామ్ చివరకు పోలీసులను ఆశ్రయించారు. తనకు, తన కుటుంబసభ్యులకు లక్ష్మణ్ నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.