ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సద్దుమణగలేదు. కొందరు వాలంటీర్ల తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ అన్నట్లుగానే ఇటీవల ఓ వాలంటీర్ బంగారం కోసం మహిళను చంపిన ఘటన కలకలం రేపింది. మరోచోట ఓ వివాహితను వాలంటీర్ తీసుకువెళ్లిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్ల కిరాతకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. విశాఖలో వృద్ధ మహిళను ఒక వాలంటీర్ హత్య చేశాడని, ఒక వివాహితను మరో వాలంటీర్ తీసుకెళ్లిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఇంటికి పడితే వారి ఇంటికి వాలంటీర్లు స్వేచ్ఛగా వెళితే ఇలాగే ఉంటుందని, అసలు వారికి ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ దారుణాలకు జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మీకు బియ్యం కావాలా? డబ్బులు కావాలా? అని వాలంటీర్లు అడుగుతున్నారని ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని అన్నారు. లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కితాబిచ్యచారు. బాబాయ్ వివేకాను హత్య చేసిన వ్యక్తి బయట తిరుగుతున్నాడని, కోడికత్తి శీను మాత్రం జైల్లో మగ్గుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మొద్దు శీను మాదిరి కోడికత్తి శీను జీవితం బలవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. శీను ఉన్న జైల్లో ఎవరో బీహారీ వ్యక్తి ఉన్నాడని చెప్పుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.