హెల్మెట్ లేకుంటే లైసెన్స్ రద్దు...సైబరాబాద్ పోలీసుల వార్నింగ్

ప్రతి ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో బైక్ యాక్సిడెంట్లలో చనిపోయే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. వీటిలో హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల సంభవించిన మరణాలే అత్యధికంగా ఉండడం కలవరపెట్టే అంశం.
గత ఏడాది జరిగిన 625 రోడ్డు ప్రమాదాల్లో 663 మంది మృతి చెందగా....వారిలో అత్యధిక శాతం హెల్మెట్‌ ధరించకపోవడంతోనే చనిపోయారు.


అందులోనూ, ఆ మృతుల్లో మెజారిటీ సంఖ్య పిలియన్‌ రైడర్లే (వాహనదారుల వెనుక కూర్చునే వారు) ఉండటం మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. అందుకే, వాహనం నడిపే వ్యక్తితో పాటు, వాహనం వెనుక కూర్చున్న పిలియన్ రైడర్ కూడా తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని సైబరాబాద్‌ పోలీసు అధికారులు నిబంధనలు నిర్ణయించారు.‌ ఆల్రెడీ జంటనగరాల్లో  రైడర్లకు, పిలియన్‌ రైడర్లకు హెల్మెట్‌ లేకుంటే ఈ–చలాన్లు విధిస్తున్నారు.


గత ఏడాది హెల్మెట్‌ లేని 18,50,000 మంది (వాహనదారులు, పిలియన్‌ రైడర్లు)కు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ–చలాన్లు జారీ చేశారు. అయినప్పటికీ, చాలామంది వాహనదారులు చలాన్లను చాలా లైట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ నిబంధనను మరింత కఠినంగా అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించుకున్నారు. హెల్మెట్ నిబంధనను రెండుసార్లు ఉల్లంఘిస్తే లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేసే యోచనలో వారు ఉన్నారు.

హెల్మెట్‌ లేకుండా బైక్ రైడ్‌ చేసినా, బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ లేకపోయినా.... తొలిసారి పనిష్మెంట్ కింద 3 నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయబోతున్నారు. ఇక రెండోసారి దొరికితే బైక్హె నడిపేవారికి హెల్మెట్‌ ఉన్నా, లేకున్నా.. పిలియన్‌ రైడర్‌ కు హెల్మెట్ లేకుంటే మాత్రం శాశ్వతంగా బైక్ నడిపే వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని సైబరాబాద్‌ పోలీసులు యోచిస్తున్నారు.


ఈ ప్రకారం రవాణా శాఖ అధికారులకు లేఖలు రాసేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కఠిన నిబంధనను ఆచరణలోకి తెచ్చే ముందు ప్రజలకు అవగాహన కల్పించేందకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మోటార్‌ వెహికల్‌ సవరణల చట్టం–2019, సెక్షన్‌ 206 (4) ద్వారా హెల్మెట్‌ లేని వాహనదారులపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారో అవగాహన కలిగించేలా వీడియోలు, షార్ట్ ఫిల్మ్ లు రూపొందిస్తున్నారు.


ఆ వీడియోలతో రాబోయే నిబంధనలపై మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం కల్పిస్తున్నారు. ప్రజలకు అవగాహన కలిగించిన తర్వాతే లైసెన్స్‌ రద్దుపై రవాణా శాఖకు లేఖలు రాస్తామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. కాబట్టి, ఇకపై బైక్ నడిపే వ్యక్తి, వెనుక కూర్చొనే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.