- ఏటా క్రమం తప్పని లాభాలు.., ప్రభుత్వానికి భారీగా డివిడెండ్
- సర్కారు పెట్టుబడి 5 కోట్లు…, వచ్చిన డివిడెండ్ 28,695 కోట్లు..
- పాలసీదారులకు బోనస్‌లు..
- ప్రభుత్వ రుణాలకూ ఆర్థిక దన్ను..
- ఏటా స్టాక్ మార్కెట్లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు
- అలాంటి లాభదాయక సంస్థను విక్రయంచేందుకు సన్నద్ధం
- వాటా విక్రయంతో వచ్చేది లక్ష కోట్లు
- కానీ మార్కెట్ విలువ రూ.15-20 లక్షల కోట్లు
ఆర్థిక సంస్కరణల పేరిట లాభసాటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం మోదీ ప్రభుత్వానికి రివాజుగా మారింది. వ్యాపారాలు చేయడం ప్రభుత్వ పని కాదన్న వాదనతో ఇప్పటికే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. తాజాగా భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)పై కన్నేసింది. ఎల్ఐసీ.. ఇది ఇంటింటి పేరు. దేశంలోని ప్రతి ఇంట్లో దాదాపుగా ఒక్కరికైనా బీమా పాలసీ ఉందంటే అతిశయోక్తి కాదు.
లక్షల కోట్ల ఆస్తులు, పెట్టుబడులతో మంచి లాభాల్లో కొనసాగుతున్న ఈ బంగారు బాతును.. పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రైవేట్‌పరం చేయడానికి మోదీ సర్కారు సిద్ధమైంది. మార్చిలోనే ఇష్యూను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మున్ముందు మరింతగా వాటాల అమ్మకం ద్వారా ప్రభుత్వం ఎల్ఐసీని పూర్తిగా ప్రై‘వేటు’ పరం చేస్తుందని ఆ సంస్థ ఉద్యోగ సంఘాలు, ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ రంగంలోని దిగ్గజ బీమా సంస్థ ఎల్ఐసీ. లక్షల కోట్ల ఆస్తులు, పెట్టుబడులు ఆ సంస్థ సొంతం. కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకూ లాభాల బాటలోనే సాగుతోంది. ఆర్థిక సహాయం కోసం అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వంపైఆధారపడిన సందర్భాలు అనేకం. ఇందుకు భిన్నంగా ఎల్ఐసీయే సర్కారుకు దన్నుగా నిలిచిన ఉదంతాలు ఎన్నో. ప్రభుత్వ సంస్థల్లో వాటాలు విక్రయించినా.. పబ్లిక్ ఇష్యూలు విజయవంతం కాకపోయినా. బ్యాంకులు దివాలా తీసినా.. ఆయా సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కేంద్రాన్ని ఆదుకుంటూ వస్తోంది.
ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలోకి ప్రైవేటు జీవిత బీమా సంస్థలు ప్రవేశించినా పోటీని తట్టుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త బీమా పథకాలు తీసుకొస్తూ.. పాలసీదారులకు మరింత చేరువవుతోంది. ప్రస్తుతం భారత జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీ వాటా 70 శాతం. ఇలాంటి దిగ్గజ సంస్థ భవిష్యతను మోదీ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తోంది. పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) పేరిట ఈ సంస్థ ఈక్విటీలో 5 నుంచి 10 శాతం వాటాలు అమ్మేందుకు సిద్ధమైంది.
ఎల్ఐసీ వచ్చాకే..
ఎల్ఐసీ ఏర్పడక ముందు మన దేశంలో ప్రైవేటు బీమా కంపెనీలు భారతీయులను ఏ మాత్రం పట్టించుకునేవి కావు. యూరోపియన్లకు తప్ప భారతీయులకు జీవిత బీమా పాలసీలు ఇచ్చేవి కావు. సంపన్న భారతీయులకైనా అదే పరిస్థితి. స్వాతంత్య్రం తర్వాతా పెద్దగా మార్పు లేదు.
కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు తప్ప, సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి బీమా రక్షణ ఎండమావిగానే ఉండేది. బీమా కంపెనీల జాతీయీకరణకు ముందు 25 బీమా కంపెనీలు దివాలా తీశాయి. 80 కంపెనీలైతే కనీసం ఏటా ఫైల్ చేయాల్సిన రిటర్న్‌లు కూడా ఫైల్ చేసేవి కావు. పాలసీదారులకు చెల్లించాల్సిన చెల్లింపులకూ ఎగనామం పెట్టేవి.
ప్రైవేటు బీమా కంపెనీల తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో భారత ప్రభుత్వం 1956 సెప్టెంబరు 1న ఎల్ఐసీని ఏర్పాటు చేసింది. కేవలం రూ.5 కోట్ల మూలధనంతో ఏర్పాటైన ఈ సంస్థ ఇంతింతై అన్నట్టుగా ఎదిగి, దేశ బీమా రంగానికి పర్యాయపదంగా మారింది.
జీవిత బీమాను సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చేరువ చేయడం ద్వారా 42 కోట్ల పాలసీలను విక్రయించింది. ఇందులో 32 కోట్ల పాలసీలు వ్యక్తిగతమైనవి. దీనినిబట్టి ఎల్ఐసీ సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి ఎంత చేరువైందో అర్థమవుతోంది. ఇరవై ఏళ్ల క్రితం వరకూ జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీది ఏకఛత్రాధిపత్యం.
1999లో వాజపేయి ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని బీమా రంగంలోకి అనుమతించింది. అయితే.. ప్రస్తుతం 23 ప్రైవేటు బీమా కంపెనీలు ఉన్నా.. బీమా మార్కెట్లో ఇప్పటికీ ఎల్ఐసీదే అగ్రస్థానం. 2021 మార్చి నాటికి ప్రీమియం ఆదాయంలో 66 శాతం, పాలసీల్లో 75 శాతం ఎల్ఐసీ వాటా కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలానికి రూ.1,437 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
భారీ లాభాలు
ఎల్ఐసీ ఏర్పాటు కోసం 1956లో ప్రభుత్వం సమకూర్చిన మూలధనం కేవలం రూ.5 కోట్లు కాగా.. ఆ పెట్టుబడిపై ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ.28,695 కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించింది. మరే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచీ ఇంత పెద్ద మొత్తంలో డివిడెండ్ లభించకపోవడం గమనార్హం. ఏటా తన మిగులు నిధుల్లో (సర్ప్లస్) 95 శాతం పాలసీదారులకు బోనస్‌గా, మిగతా ఐదు శాతాన్ని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తోంది. ప్రస్తుతం ఎల్ఐసీ పెట్టుబడుల్లో 82 శాతం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల రుణ పత్రాల్లోనే ఉన్నాయి. దీన్నిబట్టి ఎల్ఐసీ ప్రభుతాన్ని ఎలా ఆదుకుంటోందో అర్థం చేసుకోవచ్చు.
విలువ లెక్కించడంలో లోపాలు
ఎల్ఐసీ ప్రస్తుత విలువ రూ.5 లక్షల కోట్లని అంచనా (కంపెనీ ఆస్తుల నికర విలువ+ భవిష్యత లాభాల ప్రస్తుత విలువ. సంస్థ ఆస్తుల మార్కెట్ విలువను లెక్కించరు). దీని ఆధారంగా చూస్తే ఎల్ఐసీ మార్కెట్ విలువ మూడు నుంచి నాలుగు రెట్లు (దాదాపు రూ.15-20 లక్షల కోట్లు) ఎక్కువ ఉంటుంది. ఎల్ఐసీ ఐపీవో ధరను మర్చంట్ బ్యాంకర్లు ఈ విలువ ఆధారంగానే నిర్ణయించబోతున్నారు. అయితే మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఈ విలువ మదింపుతో విభేదిస్తున్నారు. సరిగ్గా లెక్కిస్తే ఎల్ఐసీ ఎంబెడెడ్ విలువ మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన అంటున్నారు. పఎ్సయూల విలువను తక్కువగా లెక్కించి, చౌకగా అమ్మేయడం ఆపాలని కోరుతూ ఆయన ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌కు లేఖ రాశారు.
గుదిబండలా కొన్ని పెట్టుబడులు
ప్రభుత్వ ఒత్తిడితో ఎల్ఐసీ కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఐడీబీఐ బ్యాంకు ఇందులో ఒకటి. సర్కారు ఒత్తిడితోనే ఎల్ఐసీ ఈ బ్యాంక్ ఈక్విటీలో మెజారిటీ వాటా తీసుకుని భారీగా నష్టపోయింది. ఎన్టీపీసీ, ఓఎన్జీసీ వంటి పీఎ్‌సయూల ఫాలో ఆన్ ఆఫర్లు (ఎఫ్‌పీవో) సబ్‌స్ర్కైబ్ కానప్పుడూ ఎల్ఐసీనే ఆదుకుంది.
గత రెండేళ్లలో దేశీయ స్టాక్ మార్కెట్ తారాజువ్వల్లా దూసుకుపోయినా, ఈ కంపెనీల షేర్లలో పెట్టుబడులు ఎల్ఐసీకి నష్టాలే మిగిల్చాయి. ఇక ఇప్పుడు ఐపీవోకు వెళ్లి సంస్థలో వాటాలు విక్రయించడం మొదలుపెడితే ఎల్ఐసీ పాలసీలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐపీవో ద్వారా ఎల్ఐసీ వాటాల అమ్మకం ఇప్పట్లో ముగియదు. ద్రవ్యలోటు పూడ్చుకునేందుకు ప్రభుత్వం ఏటా ఎంతో కొంత విక్రయించుకుంటూ పోయే ప్రమాదం ఉంది.
ఐపీవో ఎందుకు?
ఎల్ఐసీని ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పబ్లిక్ ఇష్యూకు వెళ్తున్నట్లు మోదీ సర్కారు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే రూ.36 లక్షల కోట్ల ఆస్తులతో (మార్కెట్ విలువ ప్రకారం) ఏటా క్రమం తప్పకుండా వేల కోట్ల లాభాలతో ఎల్ఐసీ ఆర్థిక పరిస్థితి పటిష్ఠంగానే ఉంది. అయినా ప్రభుత్వం ఎందుకు ఈ పనిచేస్తోందంటే.. కొండెక్కిన ద్రవ్య లోటును పూడ్చుకునేందుకేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుత మార్కెట్ బూమ్‌లో ఎల్ఐసీ ఈక్విటీలో 5శాతం వాటా అమ్మినా ప్రభుత్వానికి రూ.75,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు సమకూరుతాయి. దీంతో ద్రవ్య లోటులో చాలావరకు పూడుతుంది. గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన యశ్వంత సిన్హా, మన్మోహన్సింగ్, పి.చిదంబరం ఎల్ఐసీని ప్రైవేటుపరంగా చేయడానికి ప్రయత్నించినప్పుడు అన్ని రాజకీయ పక్షాలు, ఉద్యోగ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉద్యమానికి పిలుపివ్వడంతో వారు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం విపక్షాలకు బలం లేకపోవడంతో మోదీ ఎల్ఐసీ అమ్మకం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.