కొద్ది సంవత్సరాల క్రితం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక రాజధాని అనివార్యమైంది. దీంతో,నాటి ఏపీ సీఎం చంద్రబాబు అన్ని విధాలుగా ఆలోచించి, నిపుణుల సలహాలు సూచనలు తీసుకొని అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించారు. కోట్లాది తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వేగంగా ప్రజా రాజధాని నిర్మాణానికి నడుం బిగించారు.
నవ్యాంధ్ర ప్రజల కలలను అమరావతి సాకారం చేస్తుందని, ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులంతా నడుం బిగించాలని చంద్రబాబు ఇచ్చిన ఒక్క పిలుపుతో స్పందించిన రైతులు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు భూములు ఇవ్వడం ఆల్ టైం రికార్డు. చెప్పిందే చేసే అలవాటున్న చంద్రబాబు…శరవేగంగా అమరావతి నిర్మాణం చేపట్టి దూసుకుపోయారు.
కట్ చేస్తే…2019 ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ ఓటమి పాలవడం….జగన్ సీఎం కావడం అమరావతికి అరిష్టంగా మారింది. జగన్ సీఎం అయింది మొదలు…అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అందుకే, అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలు…నేడు శిధిలావస్థకు చేరుకున్నాయి. మూడు రాజధానులంటూ అమరావతిపై కక్ష సాధిస్తున్న జగన్…అమరావతిని ఏపీ మ్యాప్ నుంచి కూడా తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు.
ఇప్పటికే, అమరావతి అనే పేరు ఎక్కడా వినిపించకుండా ఎన్నో ప్రయత్నాలు చేసిన జగన్….తాజాగా పిల్లల మనసులోనూ విషబీజాలు నాటేందుకు ప్రయత్నాలు మొదలుబెట్టారు. తాజాగా పదో తరగతి తెలుగు పాఠ్యాంశాల నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని విద్యా శాఖ తొలగించడం జగన్ కక్షసాధింపునకు పరాకాష్ట అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉన్న అమరావతి గురించి భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో 2014లో 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ని చేర్చారు. గత చరిత్ర మొదలు నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ఎంపిక, నిర్మాణ విషయాలనూ ఇందులో పొందుపరిచారు. అయితే, అమరావతి పేరును సమూలంగా తుడిచిపెట్టే ప్రయత్నంలో భాగంగా జగన్…తాజాగా ముద్రించిన కొత్త పుస్తకాల్లో అమరావతి పాఠాన్ని తొలగించడం వివాదాస్పదమైంది.
తాజాగా ముద్రించిన పుస్తకాల్లో కేవలం 11 పాఠాలు మాత్రమే ఉండడం చర్చనీయాంశమైంది. అంతేకాదు, విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను సేకరించి కొత్త పుస్తకాలను అందించాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ‘అమరావతి’ పాఠాన్ని ఇప్పటికే ఉపాధ్యాయులు చెప్పేశారు. అయినా, అమరావతి అనేది ఓ చరిత్ర, అది ఆల్రెడీ నవ్యాంధ్ర ప్రజల మస్తిష్కాల్లో ముద్రించి ఉంది. పుస్తకాల్లో అమరావతి చరిత్ర రూపు మాపితే పోతుందనుకోవడం భ్రమే అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.