దసరా సీజన్లో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి హైప్ తెచ్చుకున్న సినిమా ‘లియో’. ఇంకా చెప్పాలంటే హిందీలో కూడా దీనికి మంచి హైపే కనిపించింది మొన్నటిదాకా. కానీ ట్రైలర్‌తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. ప్రేక్షకుల అంచనాలను ట్రైలర్ ఏమాత్రం మ్యాచ్ చేయలేదు. సినిమాలో హైలైట్లన్నీ దాచిపెట్టి నేరుగా థియేటర్లలోనే సర్ప్రైజ్ చేద్దామని దర్శకుడు లోకేష్ కనకరాజ్ అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. మొత్తానికి ట్రైలర్ అయితే బెడిసి కొట్టింది.
సినిమాలకు ఓవర్ హైప్ రావడం కూడా మంచిది కాదనే పాఠం ఈ సినిమా నేర్పింది. ఇప్పుడు ప్రేక్షకులు వీలైనంత తక్కువ అంచనాలతోనే థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఓపెనింగ్స్ మీద కూడా కొంచెం ప్రభావం చూపొచ్చు. ఇలాంటి టైంలో దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి పెద్ద సినిమాలతో పోటీ పడుతున్న ‘లియో’కు బజ్ పెంచడానికి నిర్మాత నాగవంశీ ఏం చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అతను మాత్రం సినిమా పట్ల ఏమంత ఆసక్తి లేనట్లు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తోంది.
‘లియో’ సంగతి ఏంటి అని అడిగితే.. ట్రైలర్ బాగుంది.. చాలా డిఫరెంట్‌గా, ఎగ్జైటింగ్‌గా అనిపించింది, యాక్షన్ బాగుంటుందని అంటున్నారు అంటూ ఏదో మొక్కుబడిగా ఒక కామెంట్ చేయాలన్నట్లు మాట్లాడాడు నాగవంశీ. తొలిసారి డబ్బింగ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు కదా.. తర్వాత కూడా ఈ ఒరవడిని కొనసాగిస్తారా అని అడిగితే.. అతను ఖరాఖండిగా లేదు అని చెప్పేయడం గమనార్హం.
ఇలాంటి ప్రశ్నలు ఎదురైనపుడు సాధారణంగా నెగెటివ్ ఆన్సర్లు ఇవ్వరు. లేదు అనడం కంటే చూద్దాం అని బదులిస్తారు. కానీ ‘లియో’ విషయంలో నాగవంశీకి ఏ చేదు అనుభవం ఎదురైందో ఏమో కానీ.. ఇక చెయ్యను అనేశాడు. అలాగే ఈ సినిమా గురించి మొక్కుబడిగా రెండు మాటలు మాట్లాడి ముగించేశాడు.