దసరా కానుకగా రిలీజవుతున్న ‘లియో’కు తమిళంలోనే కాదు.. తెలుగులోనూ బంపర్ క్రేజే కనిపిస్తోంది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి క్రేజీ తెలుగు చిత్రాలకు దీటుగా.. ఇంకా చెప్పాలంటే వాటిని మించి క్రేజ్ తెచ్చుకుందీ ఈ సినిమా. దసరా చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే.. ‘లియో’కు ఉన్న డిమాండ్ ఎలాంటిదో అర్థమవుతుంది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలను మించి ఈ సినిమాకు బుకింగ్స్ జరుగుతున్నాయి.
ఓ అనువాద చిత్రానికి ఉదయం 7-8 మధ్య పెద్ద ఎత్తున షోలు పడుతుండటం, అవన్నీ హౌస్ ఫుల్ అయ్యేలా కనిపిస్తుండటం ఆశ్చర్యకరం. విజయ్ కంటే కూడా లోకేష్ కనకరాజ్, అనిరుధ్ల మీద ఉన్న అంచనాలే ఈ సినిమాకు ఈ క్రేజ్ తీసుకొచ్చాయి. ఎప్పుడెప్పుడు ‘లియో’ చూద్దామా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఈ రోజు బయటికి వచ్చిన ఓ సమాచారం షాకిచ్చింది.
గురువారం రిలీజ్ కావాల్సిన ‘లియో’ను ఈ నెల 20 లోపు రిలీజ్ కాకుండా చూడాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ రోజు ఇచ్చిన ఉత్తర్వులు సంచలనం రేపాయి. ‘లియో’ టైటిల్ హక్కులు కలిగి ఉన్న ఒక వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయగా.. ఈ వ్యవహారం తేలే వరకు రిలీజ్ ఆపాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అనుకున్న ప్రకారం గురువారం షోలు పడతాయా లేదా అని అందరూ ఆందోళన చెందుతుున్నారు. ఐతే ఈ విషయమై ‘లియో’ తెలుగు నిర్మాత నాగవంశీ వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
రిలీజ్ ముంగిట ఇలా టైటిల్ విషయంలో వివాదాలు తలెత్తడం మామూలే. గతంలో ‘వాల్మీకి’ టైటిల్ విషయంలో రచ్చ జరిగితే.. ‘గద్దలకొండ గణేష్’ అని ఒక్క రోజు ముందు టైటిల్ మార్చారు. అలాగే ఖలేజా, కత్తి సినిమాల విషయంలో వివాదాలు తలెత్తితే.. వాటి పేర్ల ముందు హీరోల పేర్లను తగిలించారు. మరి ‘లియో’ వివాదానికి ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.