పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో అత్యధిక అంచనాలున్నది ‘ఓజీ’ పైనే. పవన్ ఓకే చేసి పట్టాలెక్కించిన చిత్రాల్లో ఇదే చివరిది. కానీ ముందు మొదలైన హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల కంటే ఇది వేగంగా ముందుకు కదులుతూ వచ్చింది. షూటింగ్ చాలా వరకు పూర్తయింది. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో మిగతా రెండు చిత్రాలతో పాటు ఇది కూడా పెండింగ్‌లో పడిపోయింది.
పవన్ ప్రస్తుతం వీలు చేసుకుని హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ‘ఓజీ’ టీం సైలెంటుగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతోంది. ఐతే లేటెస్ట్గా షూట్ చేశారా.. ముందే ఫినిష్ అయిందా తెలియదు కానీ.. సినిమాలోని ఒక షాట్‌కు సంబంధించిన లీక్డ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ షాట్‌ను ఒక టెక్నీషియన్‌తో కలిసి దర్శకుడు సుజీత్ చూస్తున్న ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ తల లేకుండా కుర్చీలో కూర్చుని ఉన్నాడు. పోలీస్ డ్రెస్సులో కుర్చీలో తల లేకుండా కూర్చుని ఉన్న ఫొటో చూసి పవన్ ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్లో పవన్ పోలీస్ స్టేషన్లో విధ్వంసం సాగించే షాట్ చూపించారు. పోలీస్ చెయ్యి నరకడం కోసం కత్తి కోసం వెతికే షాట్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.
ఇప్పుడు చూస్తే పోలీస్ తలే తీసేసిన షాట్ లీక్ అయింది. దీంతో ఇదేం మాస్‌రా అయ్యా అంటూ సుజీత్ మీద పవన్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతను సినిమాలో ఒక రేంజ్ మాస్ చూపించబోతున్నాడని.. ఎలివేషన్లు అలా ఇలా ఉండవని కామెంట్స్ చేస్తున్నారు. ‘ఓజీ’ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా.