తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తరువాత రేవంత్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అప్పటివరకు బాహుబలిలా కనపించిన కేసీఆర్ సైతం రేవంత్ ముందు కురచగా మారిపోయాడు. కేసీఆర్ ఎదుట నోరు విప్పడానికి కూడా సాహసించని నేతలు, ఆయనకు నమ్మినబంటుల్లాంటి నేతలు కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే.. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటున్న నేతలు మాత్రం రేవంత్ కంటే మోదీ టీంలో ఉండడమే నయమని.. పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకే అవకాశాలు ఎక్కువని.. జనం నాడి బీజేపీ వైపే ఉందని గ్రహించి బీజేపీకి జై కొడుతున్నారు.
తాజాగా బీజేపీలోకి పెరుగుతున్న చేరికలే అందుకు నిదర్శనం. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరి జహీరాబాద్ టికెట్ తెచ్చుకోగా తాజాగా మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరారు.
ఆదివారం ఒకేసారి నలుగురు బీఆర్ఎస్ నేతలు దిల్లీ వెళ్లి బీజేపీలో చేరారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సీతారాం నాయక్, జలగం వెంకట్ రావు, సైదిరెడ్డి, గోడం నగేశ్ బీజేపీ కండువా కప్పుకున్నారు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యే మహేశ్ గౌడ్ సమక్షంలో బీజేపీలో ఈ చేరికలు జరిగాయి. అలాగే, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గోమాస బీజేపీలో చేరారు.
వీరిలో జలగం వెంకట్రావు బీజేపీ నుంచి ఖమ్మం లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి చేరిన గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లిలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన వెంకటేశ్ నేత కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన పోటీ చేస్తే ఆయనకు ధీటుగా అదే నేతకాని సామాజిక వర్గం నుంచి బీజేపీ గోమాస శ్రీనివాస్‌ను పోటీ చేయించే అవకాశం ఉంది.
మొత్తానికైతే ఈ నేతలంతా తెలంగాణలో కాంగ్రెస్ కంటే బీజేపీయే లోక్‌సభ ఎన్నికలలో దూసుకెళ్లే అవకాశం ఉందన్న ఆలోచనతో కాషాయ కండువాలు కప్పుకున్నారు.
బీజేపీలోకి ముందుముందు మరిన్ని చేరికలు ఉండొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.