ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబును బెయిల్ పై బయటకు తెచ్చేందుకు సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విశ్వ ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు అరెస్టు చేసిన విధానం తప్పని, సెక్షన్ 17 ఏ ప్రకారం ఆయను అరెస్టు చేయలేదని, ఎఫ్ ఐఆర్ లో పేరు లేకుండా అరెస్టు చేయడం ఏమిటని, గవర్నర్ అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారని, సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదని ఇలా తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. ఇక, చంద్రబాబుకు కస్టడీ అవసరం లేదని, ఆయనను హౌస్ రిమాండ్ కు తరలించాలని కోరారు.
కానీ, లూథ్రా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చంద్రబాబును తాజాగా ఈ రోజు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా లూథ్రా సంచలన కామెంట్స్ చేశారు. “ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది. ప్రతి ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది” అని లూథ్రా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. లూథ్రా ఇలా ట్వీట్ చేయడం తొలిసారి కాదు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరించిన తర్వాత లూథ్రా చేసిన ట్వీట్ కూడా సంచలనం రేపింది.
”అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు..ఇక న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు..కత్తి పట్టి పోరాటం చేయడమే సరైనది…ఈరోజు ఇదే మా నినాదం” అని గురు గోవింద్ సింగ్ కోట్ ను లూథ్రా ట్విట్టర్ లో షేర్ చేశారు.