వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గోరంట్ల వీడియో ఒరిజినలురంటే టీడీపీ నేతలు ఫోరెన్సిక్ నివేదికలతో సహా బట్టబయలు చేశారు. మరోవైపు ఆ వీడియో ఒరిజినల్ కాదని మాధవ్, వైసీపీ నేతలు వాదిస్తున్నారు. పోలీసులు కోరితే తన ఫోను వారికి ఇస్తానని, ఒరిజినల్ వీడియో తన దగ్గర ఉందని మాధవ్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.
ఈ క్రమంలోనే ఆల్రెడీ మాధవ్ వీడియో వ్యవహారంపై హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ…కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలకు లేఖ రాయడం సంచలనం రేపింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలను కొందరు పోలీసులు కాపాడుతున్నారని లక్ష్మీనారాయణ ఆరోపించారు. అటువంటి పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అమిత్ షా తో పాటు ఏపీ డీజీపీకి కూడా లేఖ రాశారు.
ఇక, తాజాగా గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై సిబీఐని లక్ష్మీనారాయణ ఆశ్రయించారు. గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై చెన్నైలోని సిబీఐ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా తన ఫిర్యాదును లక్ష్మీనారాయణ పంపించారు. అంతేకాదు, తన ఫిర్యాదుతోపాటు మాధవ్ కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ను కూడా ఆయన జత చేశారు. ఇక, మాధవ్ వీడియో వ్యవహారం పక్కదారి పడుతోందని, దానివల్ల రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగే అవకాశముందని కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధవ్ వీడియో పై సత్వర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కాగా, గతంలో అనంతపురం ఎస్పీ ఫకీరప్ప….మాధవ్ వీడియో ఒరిజినల్ కాదని తేల్చడంపై కూడా లక్ష్మీనారాయణ స్పందించిన సంగతి తెలిసిందే. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఫకీరప్ప ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, వాస్తవాలను వక్రీకరించి వెల్లడిస్తున్నారని లక్ష్మీనారాయణ ఆరోపించారు. వీడియో క్లిప్ పై విచారణ జరుగుతుండగానే వివరాలను వక్రీకరించి వెల్లడించడం పోలీసుల ఎథిక్స్, స్టాండింగ్ ఆర్డర్లకు విరుద్ధమని, అందుకే పకీరప్పపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.