థియేటర్లు తెరుచుకోవడానికి సమయం దగ్గర పడింది. అన్‌లాక్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి థియేటర్లు పున:ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చింది. ఐతే మొత్తంగా థియేటర్లన్నింటినీ ఇప్పుడే తెరిచే పరిస్థితులు కనిపించడం లేదు. సింగిల్ స్క్రీన్లను అయితే తెరుస్తున్న సంకేతాలే కనిపించడం లేదు.
మల్టీప్లెక్స్ ఛైన్స్ మాత్రం స్క్రీన్లు తెరవడానికి సిద్ధమవుతున్నాయి. మరి వీటిలో ప్రదర్శించే సినిమాలు ఏవి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొత్తగా చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏవీ రిలీజయ్యే పరిస్థితి. మరి లాక్ డౌన్ మొదలవడానికి ముందు వచ్చిన చిత్రాలు మరీ పాతబడిపోయి ఉంటాయి కాబట్టి.. వాటిని చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమే.
ఇక ఉన్న ఆప్షన్ అంటే.. ‘టెనెట్’ లాంటి గత కొన్ని నెలల్లో విడుదలైన ఇంగ్లిష్ సినిమాలు, మన దగ్గర ఓటీటీల్లో విడుదలైన చిత్రాలు.‘టెనెట్’ విషయంలో రెవెన్యూ షేర్‌కు సంబంధించిన వివాదం వల్ల అది భారతీయ థియేటర్లలో వెంటనే రిలీజ్ కావడం సందేహంగా ఉంది. దీంతో వేరే ఇంగ్లిష్ సినిమాలతో థియేటర్లను పున:ప్రారంభించాలని చూస్తున్నారు.
ఇక ఓటీటీ సినిమాల విషయానికి వస్తే.. అవి థియేటర్లలోకి వచ్చే అవకాశం అంతంతమాత్రమే. ఓటీటీలు భారీ రేటు పెట్టి కొనుక్కున్న చిత్రాలను ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేస్తామంటూ అంగీకరించకపోవచ్చు. ఎక్స్‌క్లూజివ్ ఓటీటీ రిలీజ్ కోసమే ఒప్పందాలు జరిగి ఉంటాయి. థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మినిమం టైం గ్యాప్ పెట్టి ఉంటారు. అదీ కాక ఓటీటీల్లో కొత్త చిత్రాలను విడుదల చేయడాన్ని ఇంతకుముందు థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
కొన్ని మల్టీప్లెక్స్ ఛైన్స్ ఈ విషయంలో ఖండనలు ఇస్తూ.. ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలను థియేటర్లలో ప్రదర్శించబోమని స్పష్టం చేశాయి కూడా. అప్పుడు అలా ప్రకటించని థియేటర్లు కూడా ఓటీటీ సినిమాలను రిలీజ్ చేస్తే థియేటర్ల యాజమాన్యాల సంఘాలకు కోపం రావచ్చు. కాబట్టి ఓటీటీ సినిమాలేవీ కూడా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదనే అనుకోవాలి.