భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఆసక్తికర సన్నివేశానికి ఈ రోజు వేదికగా మారనుంది. ఈ సాయంత్రం సుప్రీం కోర్టు ఆవరణలో ఒక సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆవరణలోని ఆడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాంప్లెక్స్ లోని ఆడిటోరియంలో ప్రదర్శిస్తున్న బాలీవుడ్ మూవీ ప్రత్యేకత ఏమిటి? ఆ సినిమానే ఎందుకు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..
సుప్రీంకోర్టు ఆవరణలో లింగ సమానత్వాన్ని చాటి చెప్పే ఉదంతంతో విడుదలైన ‘లాపతా లేడీస్’ మూవీని బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వం వహించారు. సమాజంలో లింగ సమానత్వాన్ని నొక్కి చెప్పేందుకు వీలుగా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ తో సహా అందరూ ఈ మూవీని వీక్షించనున్నారు. సుప్రీంకోర్టు స్థాపన జరిగి 75 ఏళ్లు అవుతున్న సందర్భంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల పరంపలో ఈ మూవీని ప్రదర్శిస్తున్నారు.
‘లాపతా లేడీస్’ అంటే తప్పిపోయిన మహిళలు అని అర్థం.
2023లో తీసిని ఈ మూవీ కామెడీ డ్రామాగా చెప్పాలి.124 నిమిషాల నిడివిలో ఉన్న ఈ హిందీ మూవీని తక్కువ బడ్జెట్ లోనే రూపొందించారు. దీనికి రూ.21.65 కోట్లు వసూలు చేసింది. సినిమా కథ విషయానికి వస్తే.. పెళ్లి చేసుకొని కొత్త భార్యతో ఇంటికి వెళ్లే క్రమంలో రైలు ఎక్కుతారు. వారి సంప్రదాయం ప్రకారం ముసుగు ఉండటం.. రాత్రి వేళ రైలు దిగే వేళలో పొరపాటున భార్యకు బదులు మరో అమ్మాయి అతని వెంట వెళుతుంది. భార్య ట్రైన్ లోనే ఉండిపోతుంది. మరోవైపు.. తాను దిగాల్సిన స్టేషన్ లో దిగలేదన్న విషయాన్ని అర్థం చేసుకొని తాను చేరుకున్న స్టేషన్ లోనే దిగిపోతుంది.
తన భర్త ఊరి పేరు తెలియపోవటంతో అక్కడకు వెళ్లలేక.. అదే సమయంలో పుట్టింటికి తిరిగి వెళితే బాగోదన్న ఉద్దేశంతో రైల్వే స్టేషన్ స్టేషన్ మాష్టర్ సాయాన్ని కోరుతుంది. అక్కడే టీ షాపు నడిపే మహిళ ఆమెకు సాయం చేస్తుంది. ఆ టీ షాపులో పని చేస్తూ స్వతంత్రంగా ఉండటం నేర్చుకుంటుంది. సొంత గుర్తింపు పొందుతుంది. అనంతరం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మొత్తంగా స్త్రీకి సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో తీసిన ఈ మూవీ సందేశాత్మకంగా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే ఈ మూవీ.. తాజా పరిణామంతో మరింత మంది చూసే వీలుంటుందని చెప్పొచ్చు.